పవార్ నా హీరో: నానా పటేకర్
సాక్షి, ముంబై: శరద్ పవార్ నా హీరో అని ప్రముఖ బాలీవుడ్ నటుడు నానా పటేకర్ వ్యాఖ్యానించారు. పుణేలోని ఎన్సీపీ ఆధ్వర్యంలో జరిగిన ‘గురుజన్’ అవార్డుల కార్యక్రమంలో ఆయన పాల్గొన్న ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘నామ్’ ఫౌండేషన్ ద్వారా రాష్ట్రంలోని కరువు ప్రాంతాల్లో ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలను ఆదుకున్నారని, వర్షాలకు ముందుగానే కరువు ప్రాంతాల్లో సుమారు 540 కి.మీ. మేర కాలువలను మెరుగుపరిచే చర్యలు తీసుకున్నారని తద్వారా నీటి నిలువలు పెరిగాయన్నారు. ఈ పని చేయడానికి ప్రభుత్వానికి రూ.250 కోట్లు ఖర్చు కాగా, ఇదే పనిని నామ్ ఫౌండేషన్ కేవలం రూ.7 కోట్లతో పూర్తి చేసిందన్నారు.
కాగా, ‘శరద్ పవార్ నా హీరో’ అని సభా ముఖంగా చెప్పారు. ఆయన సమాజం కోసం పలు ఉపయోగకరమైన పనులు చేపట్టారని కొనియాడారు. పవార్ ఆధ్వర్యంలో పార్టీ ఉన్నందువల్ల నేటికి మనుగడ సాగిస్తుందని తెలిపారు. ‘గురుజన్’ అవార్డులను మాజీ ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ చేతుల మీదుగా ప్రముఖ నటుడు నానా పటేకర్, అడ్వకేట్ భాస్కర్ అవ్హాడ, మణిక్చంద్ గ్రూప్ కంపెనీకి చెందిన రసిక్ లాల్ ధారీవాల, డాక్టర్ శరద్ హార్డికర్లకు అందజేశారు.
ఈ కార్యక్రమంలో నగర మేయర్ ప్రశాంత్ జగ్తాప్, నగర పార్టీ అధ్యక్షుడు, ఎంపీ వందనా చౌహాన్, స్థాయి సమితి అధ్యక్షురాలు బాలా సాహెబ్ బోడకే, సభాధ్యక్షుడు శంకర్ కేమసే తదితరులు పాల్గొన్నారు.