చదువులో కాదు.. అనుభవంలో ...
త్యాగరాజ స్వామి ఒక కీర్తనలో...‘‘గురులేక ఎటువంటి గుణికి తెలియగబోదు... కఱుకైన హృద్రోగ గహనమును గొట్ట....’’ అంటారు. ఎటువంటి గుణాలయినా ఉండొచ్చు. ఎంత తెలివిగలవాడయినా కావొచ్చు. ఏది తెలియాలో అది తెలియాలంటే మాత్రం గురువు ఉండి తీరాలి. ఏది తెలియాలి... అంటే.. కరుకైన హృద్రోగమును గహనమును కొట్ట... హృద్రోగం చాలా కరుకైనదే.. ఊపిరి అందని వాడికి అది పరీక్షాకాలం... ఇంతమందిని విడిచిపెట్టి పోతున్నానన్న భావన.. అది కరుకైనది... దానిని గహనమున కొట్ట... అంటే అరణ్యంలా.. ఎలా చేస్తున్నాడో తెలియకుండా దానిని కొట్టగలిగినవాడు గురువు... అన్నాడు. తెలియని విషయాలు తెలియుకుండా పోవడం... తెలియవు అన్నంత వరకు పనికొస్తాయేమో గానీ.. ఆత్మ అనుభవం లోకి రావడం... అద్వైతానుభూతిని పొందడం... అన్న దగ్గరకు వస్తే అది గురువుగారి వీక్షణములచేత మాత్రమే సాధ్యమవుతుంది.. అంటాడు త్యాగయ్య.
అమ్మవారిని మూడు రకాలుగా – కామాక్షి, మీనాక్షి, విశాలాక్షి అని... అక్షి సంబంధంగా పిలుస్తారు. ఆమె గురు మండల రూపిణి. గురువులు కూడా మూడు రకాలుగా అను గ్రహిస్తారు. కామాక్షి–కుక్కుట న్యాయం.. అలాగే గురువు హస్త మస్తక సంయోగంలో శిష్యుడి బ్రహ్మస్థానం లో తన చేతిని ఉంచి అనుగ్రహిస్తాడు. అది పక్షి గుడ్డును పొదిగి దాని నుంచి పిల్ల వచ్చేటట్లుగా చేయడంలాగా ఉంటుంది. అలా పొదుగుతాడు శిష్యుడిని. అదే స్పర్శ దీక్ష.
రెండవది మీనాక్షి. విజ్ఞాన శాస్త్రంలో ఎలా ఉందనే విషయం పక్కనబెడితే యోగశాస్త్రంలో చెప్పిన ప్రకారం చేపగుడ్లు పెట్టి, వాటిని ప్రేమగా చూసిన మాత్రం చేత అవి పిల్లలవుతాయి.. అంటుంది. అలా గురువు కేవలం తన చూపులతో శిష్యుణ్ణి అనుగ్రహిస్తాడు. అలా భగవాన్ రమణులు ఒకసారి అనుగ్రహించారు. అది మీనాక్షి.
మూడవది విశాలాక్షి. బ్రహ్మాండం ఎంతవరకు ఉంటుందో అంతవరకు పరదేవత చూస్తుంటుంది. అందరూ తన బిడ్డలే అన్న స్మరణతో అనుగ్రహిస్తుంటుంది. ‘వాడు వృద్ధిలోకి రావాలి’ అని గురువు గారు సంకల్పించినంత మాత్రం చేత శిష్యుడు ఆ స్థితిని పొందుతాడు. అది విశాలాక్షీ తత్త్వం. నిజానికి కామాక్షి, మీనాక్షి, విశాలాక్షి... ఈ మూడూ కూడా శిష్యుడి వైపునుంచి గురువుకు, గురువు వైపునుంచి శిష్యుడికి ఉంటాయి. అదొక విచిత్రం. తెలిసినా తెలియక పోయినా నన్ను గురువుగారు ఒకసారి ముట్టుకుంటే చాలు, చూస్తే చాలు, స్మరిస్తే చాలు.. అన్న నమ్మకం ఉంటే... వాడు గురి కలవాడు. ఎవరి మీద అది ఉందో వారు గురువయిపోతారు. వాడి కరుకైన హృద్రోగమును గహనమును కొట్ట... అంటే అలా కొట్టగలిగినవాడు గురువు.. అంటున్నాడు త్యాగరాజు. అజ్ఞాన గ్రంథులను తొలగించి జ్ఞానాన్ని కలుగ చేయాలి అంటే... ఒక సద్గురువు ఉండాలి.
అప్పుడు భగవంతుని దర్శనం.. ఆత్మ అనుభవంలోకి వచ్చి... శాశ్వతమైనది, సత్యమైనది, నిత్యమైనది, నిరంజనమైనది, నిష్కళంకమైనది... అయిన ఆత్మ నేను తప్ప శరీరం కాదు... అని శ్లోకాల్లో చెప్పినవి, నోటితో చెప్పినవి కాక.. అనుభవంలో తెలుసుకుంటాడు శిష్యుడు.
బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు