Gutta Jitender Reddy
-
కాంగ్రెస్‌లో పెద్ద దిక్కేదీ?
పార్టీని వీడుతున్న నేతలు.. పట్టించుకోని బాధ్యులు సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని నాయకత్వ లేమి వెక్కిరిస్తోంది. కార్యకర్తలు, ద్వితీయ శ్రేణి నేతల్లో విశ్వాసం కలిగించే నాయకుడు లేక అధికార టీఆర్ఎస్లోకి ఒక్కొక్కరుగా వలసపోతున్నారు. ఇప్పటికే ఆదిలాబాద్, రంగారెడ్డి, వరంగల్, ఖమ్మం జిల్లాల్లో పార్టీ ఎమ్మెల్యేలు, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచులు టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. కాంగ్రెస్‌లో ముఖ్య నేతగా ఉన్న రెడ్యానాయక్, ఆయన కుమార్తె పార్టీని వీడి టీఆర్ఎస్లో చేరగా వారు పార్టీ మారాల్సిన అవసరం ఏమిటని రాష్ట్ర నాయకులెవరూ అడగలేదు. అలాగే ఎమ్మెల్యేలు విఠల్‌రెడ్డి, యాదయ్య, కోరం కనకయ్య తదితరులు టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకోగా వారిని కట్టడి చేయడానికి టీపీసీసీ నాయకత్వం ఎలాంటి ఆసక్తినీ చూపలేదు. కాంగ్రెస్‌కు దక్కిన ఏకైక జిల్లా పరిషత్ చైర్మన్ బాలు నాయక్ (నల్లగొండ) ఆ పార్టీని వీడిపోయారు. అదే జిల్లాకు చెందిన మదర్ డెయిరీ చైర్మన్ గుత్తా జితేందర్‌రెడ్డి (నల్లగొండ ఎంపీ సుఖేందర్‌రెడ్డి సోదరుడు) కూడా టీఆర్ఎస్ బాట పట్టారు. టీపీసీసీ అధ్యక్షుడు ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ప్రతిపక్ష నేత కె.జానారెడ్డి వంటి హేమాహేమీలు నల్లగొండ జిల్లాకు చెందినా పార్టీ నుంచి వలసలను ఆపలేకపోయారు. కరీంనగర్ డీసీసీబీ అధ్యక్షుడిగా గెలిచిన కొండూరి రవీందర్రావు టీఆర్ఎస్లో చేరారు. మహబూబ్‌నగర్ నుంచి కూడా టీఆర్ఎస్లోకి వలసలు ఉంటాయని ప్రచారం జరిగినా ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలను కాపాడుకోవడంలో ఆ జిల్లా నేతలు సఫలీకృతులయ్యారు. కాంగ్రెస్ నుంచి వలసల ప్రభావం స్థానిక సంస్థల కోటా నుంచి త్వరలో శాసనమండలికి జరిగే ఎన్నికలపై ఉంటుందని పార్టీ ముఖ్య నేతలు ఆందోళన చెందుతున్నారు. వరంగల్, నల్లగొండ, మహబూబ్‌నగర్, మెదక్ జిల్లాల్లో టీఆర్ఎస్కంటే కాంగ్రెస్‌కే ఎక్కువ మంది స్థానిక సంస్థల ప్రతినిధులున్నారు. నిజామాబాద్‌లో టీఆర్ఎస్తో సమాన స్థాయిలోనే కాంగ్రెస్ స్థానిక సంస్థల ప్రతినిధులు గెలిచారు. కానీ టీపీసీసీ, సీఎల్పీ నేతల వైఖరి వల్ల స్థానిక సంస్థల నుంచి పోటీకి ఆసక్తి చూపించలేని దుస్థితి కాంగ్రెస్‌లో నెలకొంది. -
టీఆర్ఎస్లోకి కాంగ్రెస్ నేతలు
పార్టీలో చేరిన మదర్ డెయిరీ చైర్మన్ గుత్తా జితేందర్‌రెడ్డి నల్లగొండ డీసీఎమ్మెస్ చైర్మన్ కూడా చేరిక సాక్షి, హైదరాబాద్ : అధికార టీఆర్ఎస్ పార్టీలోకి వలసలు కొనసాగుతున్నాయి. కాంగ్రెస్ నాయకుడు, నల్లగొండ ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి సోదరుడు గుత్తా జితేందర్‌రెడ్డి సీఎం కేసీఆర్ సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. నల్లగొండ-రంగారెడ్డి పాల ఉత్పత్తి దారుల సంఘం (మదర్ డెయిరీ) చైర్మన్‌గా ఉన్న జితేందర్‌రెడ్డి కొందరు డెరైక్టర్లతో కలసి వచ్చి శనివారం ముఖ్యమంత్రి అధికార నివాసంలో పార్టీలో చేరారు. ఆయనతో పాటు టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి సన్నిహిత అనుచరుడు, నల్లగొండ డీసీఎమ్మెస్ చైర్మన్ జిల్లేపల్లి వెంకటేశ్వర్ రావు (జేవీఆర్) కూడా సీఎం కేసీఆర్ సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. నల్లగొండ జిల్లా కేంద్ర సహకార బ్యాంకు (డీసీసీబీ) చైర్మన్ ముత్తవరపు పాండురంగారావు కూడా కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్లోకి మారనున్నారని, ఆయన శనివారమే చేరాల్సి ఉన్నా, వ్యక్తిగత కారణాలతో రాలేక పోయారని పార్టీ వర్గాలు తెలిపాయి. ఈనెల 8వ తే దీన నల్లగొండలో జరగనున్న బహిరంగ సభలో ఆయన గులాబీ కండువా కప్పుకోవడం ఖాయమంటున్నారు. పాండురంగారావు కూడా టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అనుచరుడు కావడం గమనార్హం. -
పోటీనా.. పొత్తా!
మోగిన నార్మాక్ ఎన్నికల నగారా మూడు డెరైక్టర్ల పదవులకు నోటిఫికేషన్ జిల్లాకు రెండు, రంగారెడ్డికి ఒకటి రిజర్వ్ స్థానాలను గెలుచుకునేందుకు అధికార పార్టీ వ్యూహం భువనగిరి : నల్లగొండ- రంగారెడ్డి జిల్లాల పాల ఉత్పత్తిదారుల పరస్పర సహాయ సహకార సంఘం (నార్మాక్) ఎన్నికల నగారా మోగింది. గుత్తా జితేందర్‌రెడ్డి చైర్మన్‌గా ఉన్న ఈ పాలకవర్గంలో 15మంది డెరైక్టర్లు ఉన్నారు. ఈ నెలాఖరులోగా డెరైక్టర్లు కాయితి వెంకట్‌రెడ్డి, మడూరి రంగారెడ్డి, రాంరెడ్డిల పదవీ కాలం ముగుస్తుంది. వీరిస్థానంలో మరో ముగ్గురిని ఎన్నుకోనున్నారు. ఈ 3 డెరైక్టర్ల స్థానాల్లో 2 జిల్లాకు, ఒకటి రంగారెడ్డి జిల్లాకు రిజర్వు చేశారు. ఈ మేరకు ఎన్నికకు నోటిఫికేషన్ జారీ అయ్యింది. అయితే మారిన రాజకీయ పరిస్థితుల వల్ల అధికార టీఆర్ఎస్ ఈ స్థానాలపై కన్నేసినట్లు తెలుస్తోంది. ఒకవేళ కుదిరితే పొత్తు.. లేకపోతే ఎన్నికలను ఎదుర్కొనేందుకు పక్కా ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. నల్లగొండ- రంగారెడ్డి జిల్లాల్లోని 21 చిల్లింగ్ సెంటర్ల పరిధిలో 421మంది పాల సొసైటీ అధ్యక్షులు నూతన డెరైక్టర్లను ఎన్నుకోనున్నారు. గ్రామాల్లో రాజకీయ వేడి.. మదర్‌డెయిరీ ఎన్నికలు అనగానే గ్రామాల్లో ఎన్నికల వేడి మొదలవుతుంది. అయితే ఈసారి మారిన ప్రభుత్వం, రాజకీయ నేపధ్యంలో టీఆర్ఎస్ డెరైక్టర్ల స్థానాల కోసం ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పటికే టీఆర్ఎస్ జిల్లా కార్యదర్శి మోతె పిచ్చిరెడ్డి ఇటీవల భువనగిరి చిల్లింగ్ సెంటర్ పరిధిలో అక్రమాలపై ఫిర్యాదు చేశారు. ఆ విచారణ కొనసాగుతోంది. మరోవైపు 421మంది సొసైటీ చైర్మన్లలో 200 మంది వరకు భువనగిరి, ఆలేరు, మునుగోడు అసెంబ్లీ సెగ్మెంట్ల నుంచే ఉన్నారు. ఈ నియోజకవర్గాల్లో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉన్నారు. ఈ మేరకు జిల్లాకు చెందిన రాష్ట్రమంత్రి జి.జగదీష్‌రెడ్డి జిల్లాకు కేటాయించిన రెండు డెరైక్టర్ల స్థానాలను కైవసం చేసుకోవడానికి పక్కా ప్రణాళికను సిద్ధం చేసుకున్నట్లు సమాచారం. కాగా ఈసారి ఎన్నికలు పోటాపోటీగా జరుగుతాయా లేదా ప్రస్తుతం ఉన్న చైర్మన్, పాలకవర్గం.. అధికార పార్టీతో పొత్తు పెట్టుకొని స్థానాలను పంచుకునే అవకాశాలు లేకపోలేదని పాడి రైతులు తెలుపుతున్నారు. ఎన్నికల షెడ్యూల్ ఈ నెల 23న ఉదయం 10 నుంచి 2 గంటల వరకు నామినేషన్ల స్వీకరణ 24న నామినేషన్ల పరిశీలన 25న ఉపసంహరణ 29న ఎన్నికలు, (మధ్యాహ్నం ఒంటి గంటల వరకు ఎన్నికలు, 2 గంటల తర్వాత లెక్కింపు) మూడు నామినేషన్లు వస్తే ఏకగ్రీవమైనట్లు ప్రకటిస్తారు..లేకపోతే రహస్య బ్యాలెట్ ద్వారా ఓటింగ్ నిర్వహిస్తారు.