
కాంగ్రెస్‌లో పెద్ద దిక్కేదీ?
పార్టీని వీడుతున్న నేతలు.. పట్టించుకోని బాధ్యులు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని నాయకత్వ లేమి వెక్కిరిస్తోంది. కార్యకర్తలు, ద్వితీయ శ్రేణి నేతల్లో విశ్వాసం కలిగించే నాయకుడు లేక అధికార టీఆర్‌ఎస్‌లోకి ఒక్కొక్కరుగా వలసపోతున్నారు. ఇప్పటికే ఆదిలాబాద్, రంగారెడ్డి, వరంగల్, ఖమ్మం జిల్లాల్లో పార్టీ ఎమ్మెల్యేలు, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచులు టీఆర్‌ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. కాంగ్రెస్‌లో ముఖ్య నేతగా ఉన్న రెడ్యానాయక్, ఆయన కుమార్తె పార్టీని వీడి టీఆర్‌ఎస్‌లో చేరగా వారు పార్టీ మారాల్సిన అవసరం ఏమిటని రాష్ట్ర నాయకులెవరూ అడగలేదు. అలాగే ఎమ్మెల్యేలు విఠల్‌రెడ్డి, యాదయ్య, కోరం కనకయ్య తదితరులు టీఆర్‌ఎస్ తీర్థం పుచ్చుకోగా వారిని కట్టడి చేయడానికి టీపీసీసీ నాయకత్వం ఎలాంటి ఆసక్తినీ చూపలేదు. కాంగ్రెస్‌కు దక్కిన ఏకైక జిల్లా పరిషత్ చైర్మన్ బాలు నాయక్ (నల్లగొండ) ఆ పార్టీని వీడిపోయారు. అదే జిల్లాకు చెందిన మదర్ డెయిరీ చైర్మన్ గుత్తా జితేందర్‌రెడ్డి (నల్లగొండ ఎంపీ సుఖేందర్‌రెడ్డి సోదరుడు) కూడా టీఆర్‌ఎస్ బాట పట్టారు.
టీపీసీసీ అధ్యక్షుడు ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ప్రతిపక్ష నేత కె.జానారెడ్డి వంటి హేమాహేమీలు నల్లగొండ జిల్లాకు చెందినా పార్టీ నుంచి వలసలను ఆపలేకపోయారు. కరీంనగర్ డీసీసీబీ అధ్యక్షుడిగా గెలిచిన కొండూరి రవీందర్‌రావు టీఆర్‌ఎస్‌లో చేరారు. మహబూబ్‌నగర్ నుంచి కూడా టీఆర్‌ఎస్‌లోకి వలసలు ఉంటాయని ప్రచారం జరిగినా ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలను కాపాడుకోవడంలో ఆ జిల్లా నేతలు సఫలీకృతులయ్యారు. కాంగ్రెస్ నుంచి వలసల ప్రభావం స్థానిక సంస్థల కోటా నుంచి త్వరలో శాసనమండలికి జరిగే ఎన్నికలపై ఉంటుందని పార్టీ ముఖ్య నేతలు ఆందోళన చెందుతున్నారు. వరంగల్, నల్లగొండ, మహబూబ్‌నగర్, మెదక్ జిల్లాల్లో టీఆర్‌ఎస్‌కంటే కాంగ్రెస్‌కే ఎక్కువ మంది స్థానిక సంస్థల ప్రతినిధులున్నారు. నిజామాబాద్‌లో టీఆర్‌ఎస్‌తో సమాన స్థాయిలోనే కాంగ్రెస్ స్థానిక సంస్థల ప్రతినిధులు గెలిచారు. కానీ టీపీసీసీ, సీఎల్పీ నేతల వైఖరి వల్ల స్థానిక సంస్థల నుంచి పోటీకి ఆసక్తి చూపించలేని దుస్థితి కాంగ్రెస్‌లో నెలకొంది.