![Devarakonda Constituency MLA Candidate Nalgonda - Sakshi](/styles/webp/s3/article_images/2018/11/18/GG.jpg.webp?itok=IfPtrPXe)
బిల్యానాయక్, బాలునాయక్
సాక్షిప్రతినిధి, నల్లగొండ : దేవరకొండలో ఎన్నికల రాజకీయం ఆసక్తిగొల్పుతోంది. కాంగ్రెస్ తన అభ్యర్థిగా జెడ్పీ చైర్మన్ బాలునాయక్‌కు టికెట్ ప్రకటించిన వెంటనే ఆ పార్టీలో పరిణామాలు వేగంగా మారాయి. దాదాపు ఏడాది కిందట టీడీపీ జిల్లా అధ్యక్షుడిగా పనిచేస్తూ కాంగ్రెస్ గూటికి చేరిన బిల్యానాయక్ అనివార్యంగా కాంగ్రెస్‌ను వీడాల్సి వచ్చింది. టీడీపీనుంచి కాంగ్రెస్‌లోకి వచ్చే ముందు టికెట్ హామీతోనే నిర్ణయం తీసుకున్నారని అంటున్నారు. రేవంత్‌రెడ్డి వెంట రాహుల్‌గాంధీ సమక్షంలో పార్టీలో చేరారు. తీరా చివరి నిమిషం దాకా ఉత్కంఠ రేపి ఆఖరికి తమ పార్టీ నుంచి గతంలో ఎమ్మెల్యేగా పనిచేసిన, ప్రస్తుత జెడ్పీ చైర్మన్ బాలునాయక్ వైపే మొగ్గుచూపింది.
వాస్తవానికి బాలునాయక్ కూడా చైర్మన్‌గా ఎన్నికై ఏడాది గడవక ముందే టీఆర్‌ఎస్ బాట పట్టారు. ఇన్నాళ్లూ ఆ పార్టీలో కొనసాగిన ఆయన దేవరకొండ టికెట్ ఆశించారు. కానీ, టీఆర్‌ఎస్ నాయకత్వం సీపీఐనుంచి తమ పార్టీలో ఎమ్మెల్యే హోదాలో చేరిన రవీంద్రకుమార్ కే టికెట్ ఇచ్చింది. దీంతో నారాజైన బాలు సెప్టెంబరు నెల మధ్యలో కాంగ్రెస్‌కు తిరిగి వచ్చారు. దీంతో కాంగ్రెస్‌లో జగన్‌లాల్‌నాయక్, బిల్యానాయక్, బాలూనాయక్ మధ్య టికెట్‌కు పోటీ ఏర్పడింది. నిన్నా మొన్నటి దాకా ఎవరికి టికెట్ వచ్చినా, అందరం కలిసి పనిచేస్తామని ప్రకటనలూ ఇచ్చారు. తీరా ఇప్పుడు బాలునాయక్‌కు టికెట్ రావడతో బిల్యా ఆ పార్టీ నుంచి బయటకు వచ్చేశారు.
గత ఎన్నికల్లో రెండో స్థానం
గత ఎన్నికల్లో కాంగ్రెస్ ఇక్కడినుంచి పోటీ చేయలేదు. కాంగ్రెస్ మద్దతుతో సీపీఐ విజయం సాధిం చింది. అంతకు ముందు (2009) కాంగ్రెస్ నుంచి బాలూనాయక్ ఎమ్మెల్యేగా చేశారు. తమ సిట్టింగ్ సీటును త్యాగం చేసి మరీ కాంగ్రెస్ ఇక్కడ సీపీఐకి 2014 ఎన్నికల్లో మద్దతు ఇచ్చింది. ఆ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన రవీంద్రకుమార్ టీఆర్‌ఎస్ బాట పట్టడం, జెడ్పీ చైర్మన్‌గా కాంగ్రెస్‌నుంచే ఎ న్నికైన బాలునాయక్ గులాబీ గూటికే చేరడంతో , భవిష్యత్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని టీడీపీ నుంచి బిల్యానాయక్‌ను ఆహ్వానించింది. కానీ, ఎన్నికల్లో టికెట్ మాత్రం ఇవ్వలేకపోయింది. గత ఎన్నికల్లో ఇక్కడ టీఆర్‌ఎస్ పోటీ చేసినా, మూడో స్థానంలో నిలిచింది.
సీపీఐ, టీడీపీల మధ్యే ప్రధా న పోరు నడిచింది. టీడీపీనుంచి బిల్యా నాయక్ పోటీ పడగా, తక్కువ మెజారిటీతోనే ఆయన ఓడిపోయారు. ఆ ఎన్నికల్లో బిల్యాకు వచ్చిన ఓట్లను చూసే, కాంగ్రెస్ బిల్యాను పార్టీలో చేర్చుకుంది. కానీ, ముందస్తు ఎన్నికల నేపథ్యంలో చోటు చేసుకున్న పరిణామాలు, జిల్లా కాంగ్రెస్ రాజకీయాల్లో చక్రం తిప్పే నేతల మద్దతు, కాంగ్రెస్‌లో రాష్ట్ర స్థా యిలో నేతల మధ్య ఉన్న ఆధిపత్య పోరు తదితర కారణాలతో బిల్యాకు మొండి చేయిచూపింది. దీంతో ఆయన శనివారం బీఎల్‌ఎఫ్ కండువా కప్పుకున్నారు. బీఎల్‌ఎఫ్ తరఫున ఆయన దే వరకొండలో పోటీచేయడం ఖాయమంటున్నారు. దీంతో ఇక్కడి రాజకీయం రంజుగా మారింది.
దేవరకొండ అభ్యర్థి.. నేనావత్ బాలునాయక్
పేరు : నేనావత్ బాలునాయక్
తండ్రిపేరు : లస్కర్
పుట్టిన తేదీ : 03–07–1972
విద్యార్హతలు : బీ.ఏ(ఎల్‌ఎల్‌బీ)
స్వగ్రామం : సూర్యతండా, ముదిగొండ,
దేవరకొండ మండలము, నల్లగొండ
రాజకీయ ప్రస్థానం, చేపట్టిన పదవులు : ఎన్‌ఎస్‌యూఐ దేవరకొండ ప్రెసిడెంట్, నల్లగొండ జిల్లా సెక్రటరీ, యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు, ఎంపీటీసీ, జెడ్పీటీసీ(1999–2004), కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ అధ్యక్షుడు(2004–05), వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్, సీపీఐ అభ్యర్థి రవీంద్రకుమార్‌పై పోటీ చేసి ఎమ్మెల్యేగా(2009) గెలుపొందారు. కాంగ్రెస్, సీపీఐ పొత్తులో భాగంగా సీపీఐకు టిక్కెట్ కేటాయించారు(2014). చందంపేట నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున జెడ్పీటీసీగా పోటీ చేసి విజయం సాధించిన ఆయనకు జిల్లా పరిషత్ చైర్మన్ పదవీ లభించింది.
Comments
Please login to add a commentAdd a comment