సాక్షి, హైదరాబాద్: నల్గొండ జిల్లా దేవరకొండ నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ నేత బిల్యా నాయక్ బీఆర్‌ఎస్‌లో చేరారు. తెలంగాణ భవన్‌లో మంత్రి జగదీశ్ రెడ్డి, దేవరకొండ ఎమ్మెల్యే రవీంద్ర నాయక్ ఆధ్వర్యంలో మంత్రి కేటీఆర్.. బిల్యా నాయక్, ఆయన అనుచరులకు గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ కాంగ్రెస్‌పై నిప్పులు చెరిగారు. ఎన్నికలు వచ్చినప్పుడల్లా గమ్మత్తైన డైలాగులు, ఊదరగొట్టే ఉపన్యాసాలు ఇవ్వడం కాంగ్రెస్ పార్టీకి అలవాటేనని విమర్శించారు.
గిరిజనులకు ఆత్మ గౌరవం ఇస్తోంది కేసీఆర్
రైతులకు 24 గంటల కరెంట్ ఉచితంగా ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని కేటీఆర్ చెప్పారు. విద్యుత్ రంగాన్ని మంత్రి జగదీశ్ రెడ్డి అభివృద్ధి పథంలో ముందుకు తీసుకుకెళ్తున్నారన్నారు. సీఎం కేసీఆర్‌తోనే గిరిజనులకు న్యాయం జరుగుతుందని.. దశాబ్దాలు కోట్లాడిన బాగుపడని తాండాలు ఇప్పుడు సీఎం నాయకత్వంలో అభివృద్ధి చెందుతున్నాయన్నారు. నాడు నల్గొండలో వంకర తిరిగిన కాళ్లు కనిపించేవని.. కేసీఆర్ వచ్చాక మంచి నీళ్లు అందిస్తున్నారని చెప్పారు. అన్ని రంగాల్లో తెలంగాణ అభివృద్ది చెందుతుందన్నారు.
గత 15 రోజుల నుంచి 32 నియోజకవర్గాలకు వరకు తిరిగానని కేటీఆర్ గుర్తు చేశారు. ఆదిలాబాద్ నుంచి వనపర్తి దాకా, సత్తుపల్లి నుంచి మెదక్ వరకు.. తెలంగాణలోని నాలుగు మూలాలను తిరిగాను. ప్రజల మూడ్ స్పష్టంగా కనబడుతోంది. ప్రజల నుంచి అసహనం వ్యక్తం కావడం లేదు. ప్రభుత్వం మీద వ్యతిరేకత కనబడకపోగా, కేసీఆర్ తిరిగి ముఖ్యమంత్రి అయితేనే పేదలు, రైతులు, బడుగు, బలహీన వర్గాలు బాగుపడతాయని ప్రజలు విశ్వసిస్తున్నారని కేటీఆర్ తెలిపారు.
చదవండి: ఈసీ ఆదేశం.. తెలంగాణలో పలువురు ఎస్పీలు, కలెక్టర్ల బదిలీ
ఎన్నికలు రాగానే వస్తారు..
ఎన్నికలు రాగానే కాంగ్రెస్ పార్టీ వాళ్లు వస్తారని పార్టీ కార్యాయానికి కొత్త రంగులు వేసుకుంటారని, కొత్త డ్రెస్సులు వేసుకుంటారని కేటీఆర్ విమర్శించారు. ఆయన మాట్లాడుతూ.. ‘ముఖ్యమంత్రి, మంత్రి తానంటే తాను అని పోటీ పడుతారు. ఇక మీడియాలో కూడా సర్వే వస్తది.. అంతా అయిపోయిందంటారు. గమ్మతైన డైలాగులు, ఊదరగొట్టే ఉపన్యాసాలు ఇస్తారు. 2018లో అప్పుడు పీసీసీ ప్రెసిడెంట్ ఉత్తమ్ కుమార్ రెడ్డి. కేసీఆర్‌ను ఓడించే దాకా గడ్డమే తీయను అని స్టేట్‌మెంట్ ఇచ్చారు. మరి ఉత్తమన్న గడ్డం ఉందో పీకిందో తెలియదు గానీ, ఇలాంటి డైలాగులు మస్తుగా విన్నాం.
ఆ సన్నాసి మళ్లా పోటీ చేస్తుండు
ఇప్పుడున్న రేవంత్ రెడ్డి కూడా డైలాగులు కొట్టిండు. కొడంగల్‌లో నన్ను ఓడిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటానని స్టేట్‌మెంట్ ఇచ్చిండు. ఆ సన్నాసి మళ్లా పోటీ చేస్తుండు.. అది వేరే విషయం కానీ.. ఇలా బేకర్ డైలాగులు కొడుతారు. ఐదారేండ్ల కింద ఓటుకు నోటు.. ఇప్పుడేమో సీటుకు నోటు.. అందుకే రేవంత్ రెడ్డిని ఇప్పుడు రేటంత రేటంత అని అంటున్నారు. వాళ్లతోటి ఏం కాదు’ అంటూ కేటీఆర్ నిప్పులు చెరిగారు.
వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌కు బుద్ది చెప్పాలి
‘భారత దేశంలో తెలంగాణ నంబర్1 లో నిలిపింది కేసీఆర్. నల్లగొండ జిల్లాకు 5లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులు కేవలం దేవరకొండకు ఇచ్చింది కేసీఆర్. ఏడాదిలో డిండి ప్రాజెక్ట్ పూర్తిచేసి దేవర కొండ సస్యశ్యామలం చేస్తాం. కాంగ్రెస్ పార్టీకి ఒక్క ఛాన్స్ కాదు, 11 ఛాన్సులు ఇచ్చాం. ఇన్నేళ్లు వాళ్ళ పాలన చూడలేదా?. అప్పుడెందుకు అభివృద్ది చేయలేదు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌కు బుద్ది చెప్పాలి
మేము ఎవరికి బీ టీమ్ కాదు
గిరిజన విశ్వ విద్యాలయానికి స్థలం ఏనాడో ఇచ్చాం. కానీ ఇప్పుడొచ్చి దాని గురించి మాట్లాడుతున్నారు. కేంద్రమంత్రి అమిత్ షా పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారు. రైతుల ఆత్మహత్యలు తెలంగాణ దేశంలో నంబర్ 1 అంటూ అమిత్ షా అంటున్నారు. పార్లమెంట్‌ళో తెలంగాణ లో రైతు ఆత్మహత్యలు లేవని చెప్పింది మీ కేంద్రమే. బీజేపీకి బీఆర్‌ఎస్ బీ టీమ్ అంటోంది కాంగ్రెస్, కాంగ్రెస్‌కు బీఆర్‌ఎస్ బీ టీమ్ అంటూ బీజేపీ చెప్తోంది. మేము ఎవరికి బీ టీమ్ కాదు. తెలంగాణకు రావాల్సిన ప్రాజెక్టులు, నిధులను కేంద్రం ఇవ్వలేదు. డాక్టర్ చదవాలంటే చాలా కష్టం ఉండేది. కానీ ఇప్పుడు కేసిఆర్ వచ్చాక నల్లగొండ కు కూడా మెడికల్ కాలేజీ ఇచ్చారు’ అని కేటీఆర్ పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment