సాక్షిప్రతినిధి, నల్లగొండ : కాంగ్రెస్‌లో టికెట్ల లొల్లి ఇంకా పరిష్కారం కాలేదు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని పన్నెండు నియోజకవర్గాలకుగాను పది స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన పార్టీ నాయకత్వం ఇంకా దేవరకొండ, మిర్యాలగూడ, తుంగతుర్తి స్థానాలను పెండింగ్‌లో పెట్టింది. మొదటి విడతలో కూటమి భాగస్వామ్య పక్షాలకు ఒక్క సీటు కూడా కేటాయించలేదు. దీంతో మిగిలిన ఈ మూడు స్థానాల్లో ఏ కూటమి పక్షానికి ఏ స్థానం కేటాయిస్తారు..? అసలు ఒక్క సీటన్నా వారికి విడిచిపెడతారా..? లేదంటే మూడు స్థానాల్లోనూ కాంగ్రెస్ అభ్యర్థులనే ప్రకటిస్తారా అన్న ప్రశ్నలు ఉత్కంఠ రేపుతున్నాయి. నామినేషన్ల దాఖలుకు మరో మూడు రోజులే మిగిలి ఉండడంతో శనివారం ఆ పార్టీ జాతీయ నాయకత్వం ఆఖరి విడత జాబితాను విడుదల చేయనుందని చెబుతున్నారు.
దీంతో ఈ మూడు స్థానాల అభ్యర్థులు ఎవరవుతారోనన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌తో కూటమి కట్టిన టీడీపీ, సీపీఐ, టీజేఎస్, ఇంటి పార్టీలకు జిల్లాలో ఒక్కటంటే ఒక్క సీటు కూడా కాంగ్రెస్ కేటాయించలేదు. రాష్ట్ర స్థాయిలో సీట్ల సర్దుబాటులో భాగంగా ఇక్కడ కేటాయింపులు జరగలేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ కారణంగానే కూటమి పక్షాలు తిరుగుబాటు చేస్తాయా? పోటీగా బరిలోకి దిగుతాయా అన్న సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.
ఆసక్తి రేపుతున్న మిర్యాలగూడ
టీజేఎస్ ముందునుంచీ మిర్యాలగూడ ఆశిస్తోం ది. కానీ, ఇక్కడినుంచి సీఎల్పీ మాజీ నేత కుం దూరు జానారెడ్డి తనయుడు రఘువీర్‌రెడ్డి టికెట్ కోసం పట్టుబడుతున్నారు. రఘువీర్‌రెడ్డికి ఇవ్వలేని పక్షంలో తనకు అవకాశం ఇవ్వాలని టీఆర్‌ఎస్‌నుంచి కాంగ్రెస్‌లోకి చేరిన అలుగుబెల్లి అమరేందర్‌రెడ్డి కోరుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా టీజేఎస్‌కు ఇప్పటికే 8 స్థానాలను కేటాయించారు. అదనంగా తమకు మరో స్థానం కావాలని, అది మిర్యాలగూడమేనని కోరుతోంది. కాంగ్రెస్‌పై ఒత్తిడి పెంచేందుకు తాము 12 స్థానాల్లో పోటీ చేస్తామని టీజేఎస్ నాయకత్వం జాబితా కూడా ప్రకటించింది. ఆ పన్నెండు స్థానాల్లో మిర్యాలగూడ కూడా ఉండడం గమనార్హం. మరో వైపు రఘువీర్‌రెడ్డికి టికెట్ ఇవ్వలేమని ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తేల్చి చెప్పారని అంటున్నా రు. దీంతో ఢిల్లీ ప్రయత్నాలను పక్కన పెట్టేశారని సమాచారం. ఈ పరిస్థితుల్లో కాంగ్రెస్‌నుంచి ఎవరికి అవకాశం దక్కుతుంది..? లేదంటే టీజేఎస్‌కే ఇచ్చేస్తారా..? అన్న చర్చ జోరుగా సాగుతోంది.
రెబల్‌గా .. బరిలోకి అలుగుబెల్లి ?
టీఆర్‌ఎస్ నియోజకవర్గ ఇన్‌చార్జీగా పనిచేసిన అలుగుబెల్లి అమరేందర్‌రెడ్డి టీఆర్‌ఎస్ నుంచి టికెట్ ఆశించి భంగపడ్డారు. ఆ తర్వాత కొద్దిరోజులకు ఆయన కాంగ్రెస్ గూటికి చేరారు. జానా తనయుడు రఘువీర్‌రెడ్డికి టికెట్ దక్కని పక్షంలో తనకు అవకాశం ఇవ్వాలని ఆయన కోరుతూ వచ్చారు. ఆ హామీపైననే కాంగ్రెస్ కండువా కప్పుకున్నారన్న అభిప్రాయం కూడా ఉంది. ఇప్పుడు అసలు మిర్యాలగూడ స్థానం ఎవరికి ఇస్తారో తెలియని సందిగ్ధంలో ఉన్న ఈ సమయంలో... ‘ ఒకవేళ మిర్యాలగూడ స్థానాన్ని టీజేఎస్‌కు కేటాయించినట్లయితే... ఇండిపెండెంట్‌గానైనా పోటీ చేయాల్సిందే..’ అని అలుగుబెల్లిపై ఒత్తిడి పెంచుతున్నారని సమాచారం.
ఈ ప్రాంతంలో టీజేఎస్ ఏమాత్రం బలంగా లేకపోవడం, కాంగ్రెస్ ఈ స్థానాన్ని తిరిగి నిలబెట్టుకునే అవకాశం ఉందన్న విశ్వాసంతో కాంగ్రెస్‌లోని ఒక వర్గం రెబల్ ఆలోచనలు చేస్తోందని చెబుతున్నారు. టీఆర్‌ఎస్‌లో టికెట్ దక్కకపోవడంతో ఇండిపెండెంట్‌గా పోటీ చేయడానికి అన్ని ఏర్పాట్లు చేసుకుని, ప్రచారం కూడా చేసిన అలుగుబెల్లిని కాంగ్రెస్ సీనియర్లు హామీ ఇచ్చి పార్టీలో చేర్చుకున్నారని అంటున్నారు. ఇప్పుడు అక్కడ కూడా టికెట్ రాకుంటే స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయడానికే అమరేందర్‌రెడ్డి మొగ్గు చూపుతున్నారని చెబుతున్నారు.
కొనసాగుతున్న సస్పెన్స్
దేవరకొండ, తుంగతుర్తి నియోజకవర్గాల్లోనూ శనివారం దాకా సస్పెన్స్ తప్పేలా లేదు. ఇక్కడ కూటమి పక్షాల గొడవ లేకున్నా, కాంగ్రెస్‌లోనే పోటీదారులు ఎక్కువగా ఉన్నారు. దేవరకొండ స్థానాన్ని జగన్‌లాల్ నాయక్, బిల్యానాయక్, జెడ్పీ చైర్మన్ బాలునాయక్ ఆశిస్తున్నారు. రేవంత్ రెడ్డి వెంట పార్టీలో చేరిన బిల్యా నాయక్ ఆయన కోటాలోనే ప్రయత్నం సాగిస్తుండగా, కాంగ్రెస్ నుంచి ఒకసారి ఎమ్మెల్యేగా గెలిచిన బాలునాయక్, అదే పార్టీనుంచి జెడ్పీ చైర్మన్ కూడా అయ్యారు. ఆ తర్వాత టీఆర్‌ఎస్‌కు వెళ్లినా, తిరిగి సొంత గూటికి చేరుకుని టికెట్ ఆశిస్తున్నారు. ఇప్పుడు ఈ ముగ్గురు నాయకుల మధ్య టికెట్ దోబూచులాడుతోంది. ఇక, తుంగతుర్తిలో అద్దంకి దయాకర్ , డాక్టర్ రవి పోటీ పడుతున్నారు. ఈ స్థానం లెక్క తేలాల్సి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment