సభలో ప్రసంగిస్తున్న ఆపద్ధర్మ సీఎం కేసీఆర్, చిత్రంలో భువనగిరి టీఆర్‌ఎస్ అభ్యర్థి పైళ్ల శేఖర్‌రెడ్డి, హాజరైన జనం
సాక్షిప్రతినిధి, నల్లగొండ/సాక్షి, యాదాద్రి : ఆపద్ధర్మ సీఎం, టీఆర్‌ఎస్ అధ్యక్షుడు కె.చంద్రశేఖర్ రావు (కేసీఆర్) జిల్లా పర్యటన విజయవంతం అయ్యింది. ఆయన బుధవారం ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని దేవరకొండ, నకిరేకల్, భువనగిరి నియోజకవర్గ కేంద్రాల్లో ఎన్నికల ప్రచార సభల్లో పాల్గొన్నారు. ఏ నియోజకవర్గంలో ఎవరెవరు ప్రధాన ప్రత్యర్థులో తెలిసిపోయాక, తమ అభ్యర్థుల తరఫున కేసీఆర్ ప్రచారానికి వచ్చారు. దేవరకొండ, నకిరేకల్ సభల్లో ఇరవై ఐదు నిమిషాలచొప్పున ప్రసంగించిన కేసీఆర్ భువనగిరి సభలో మాత్రం పది నిమిషాల్లోపే ముగించారు. ఆయా నియోజకవర్గాల అభ్యర్థుల్లో మరింతగా ధైర్యాన్ని నింపేందుకు ఈసభలు ఉపయోగపడ్డాయని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. తమకు దక్కకుండా పోతున్న దేవరకొండపై గులాబీ జెండా ఎగురవేసేందుకు ప్రయత్నిస్తోంది. గత ఎన్నికల్లో ఈ నియోజకవర్గంలో టీఆర్‌ఎస్ మూడో స్థానానికి పరిమితమైంది. కాకుంటే, ఎమ్మెల్యే హోదాలో రవీంద్ర కుమార్ గులాబీ గూటికి చేరడంతో గడిచిన రెండేళ్లు ఆ పార్టీ ఎమ్మెల్యే ఉన్నట్లు భావించింది. ఈ ఎన్నికల్లో రవీంద్ర కుమార్‌ను తమ అభ్యర్థిగా ప్రకటించారు. దీంతో ఆయన గెలుపు బాధ్యతను భుజాన వేసుకుని పార్టీ నాయకత్వం పనిచేస్తోంది.దీనిలో భాగంగానే ఆపద్ధర్మ సీఎం కేసీఆర్
దేవరకొండ అభివృద్ధి నా బాధ్యత :
కొండమల్లేపల్లి/చందంపేట/ చింతపల్లి/పెద్దఅడిశర్లపల్లి : దేవరకొండ అభివృద్ధి తన వ్యక్తిగత బాధ్యతగా తీసుకుంటానని ఆపదర్ధ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. అభివృద్ధి సాధించాలంటే డిసెంబర్‌లో జరిగే ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటు వేసి టీఆర్‌ఎస్‌ను గెలిపించాలని కోరారు. బుధవారం దేవరకొండ పట్టణంలోని ముదిగొండ ఎక్స్‌రోడ్డులో నిర్వహించిన టీఆర్‌ఎస్ ఎన్నికల ప్రచార సభలో ఆయన మాట్లాడారు. దేశంలో ఎక్కడా లేని విధంగా.. రాష్ట్రంలో ఎన్నో అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి అమలు చేసిన ఘనత టీఆర్‌ఎస్ ప్రభుత్వానిదేనన్నారు. సమైక్య పాలనలో ఫ్లోరైడ్ రక్కసితో ఇబ్బందిపడ్డ ఈ ప్రాంతవాసులు వలస పోయి కూలీలుగా బతుకుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలోనే అత్యధికంగా దేవరకొండ నియోజకవర్గంలో 85 తండాలను గ్రామపంచాయతీలుగా ఏర్పాటు చేసి అభివృద్ధికి బాటలు వేశామన్నారు.
నియోజకవర్గ పరిధిలోని నేరెడుగొమ్ము ప్రాంతానికి పెద్దమునిగల్‌కు లిఫ్ట్ ద్వారా నీళ్లు అందించేందుకు కృషి చేస్తానని హామీనిచ్చారు. దేవరకొండ నియోజకవర్గ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారిస్తానని, పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు గాను ఎంపీ గుత్తా, టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి రమావత్ రవీంద్రకుమార్ తనను సంప్రదించారని చెప్పారు. జిల్లాలో ఉన్న కాంగ్రెస్ నాయకులు జానారెడ్డి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఏనాడూ దేవరకొండ నియోజకవర్గాన్ని పట్టించుకున్న పాపాన పోలేదన్నారు. దేవరకొండ అభ్యర్థి రవీంద్రకుమార్‌ను 50వేల మెజారిటీతో గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి, ఎంపీలు కె.కేశవరావు, గుత్తా సుఖేందర్‌రెడ్డి, టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి రమావత్ రవీంద్రకుమార్, ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్, మదర్ డెయిరీ చైర్మన్ గుత్తా జితేందర్‌రెడ్డి, నాయకులు గాజుల ఆంజనేయులు, రాంచందర్‌నాయక్, రాంబాబునాయక్, ఎం పీపీ మేకల శ్రీనివాస్‌యాదవ్, జెడ్పీటీసీ ఆలంపల్లి నర్సింహ, కోదాడ మాజీ ఎమ్మెల్యే చందర్‌రావు, మాజీ జెడ్పీటీసీ తేర గోవర్ధన్‌రెడ్డి, పాండురంగారావు, దేవేందర్‌రావు, పల్లా ప్రవీణ్‌రెడ్డి, వడ్త్య దేవేందర్, జాన్‌యాదవ్, బండారు బాలనర్సింహ, ఏరుకొండలుయాదవ్ పాల్గొన్నారు.
24 గంటల కరెంటు ఇస్తున్న రాష్ట్రం తెలంగాణ :
దేశంలోనే రైతులకు 24 గంటల ఉచిత కరెంటు ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని, ప్రాజెక్టుల నిర్మాణాల్లో సైతం దేవరకొండ ముందుందని నల్ల గొండ ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి అన్నారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాలుగున్నరేళ్ల కాలంలో తెలంగాణ రాష్ట్రం 60 శాతం అభివృద్ధి సాధించిందని పేర్కొన్నారు. దేవరకొండ, మునుగోడు నియోజకవర్గాలకు సాగు, తాగునీరు అందించేందుకు రూ.6500 కోట్లతో డిండి ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించామని గుర్తుచేశారు. నియోజకవర్గ పరిధిలోని సింగరాజుపల్లి, గొట్టిముక్కల, కిష్టరాంపల్లి రిజర్వాయర్ల పనులు కొనసాగుతున్నాయని ఈ ప్రాజెక్టులు పూర్తయితే ఈ ప్రాంతం సస్యశామలమవుతుందన్నారు. నక్కలగండి రిజర్వాయర్ పనులు 80 శాతం పూర్తి చేసిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్‌దని పేర్కొన్నారు. అభివృద్ధికి నిరోధకులుగా మారిన మహాకూటమిని ఓడించాలని పిలుపునిచ్చారు.
ఆదరించి ఆశీర్వదించండి ...
డిసెంబర్ 7న జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో దేవరకొండ నియోజకవర్గ ప్రజలు తనను ఆదరించి ఆశీర్వదించాలని టీఆర్‌ఎస్ దేవరకొండ ఎమ్మెల్యే అభ్యర్థి రమావత్ రవీంద్రకుమార్ కోరారు. రానున్న ఎన్నికల్లో తనను గెలిపిస్తే దేవరకొండ నియోజకవర్గ అభివృద్ధికి అహర్నిశలు పాటుపడుతానని పేర్కొన్నారు. నియోజకవర్గంలో సాగు నీటి వనరుల కల్పనకు కోట్ల రూపాయలు ఖర్చుచేస్తున్నామనారు. దేవరకొండ ఖిలాపై గులాబీ జెండా ఎగురవేసేందుకు ప్రజలు తనను ఆశీర్వదించాలని కోరారు.
దేవరకొండ సభలో మాట్లాడుతున్న ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్, చిత్రంలో పార్టీ నాయకులు
కూటమి గూటంగా మారింది : నాయిని
రాష్ట్రంలో కూటమి గూటంగా మారిం దని.. ఎన్నికల ప్రచారానికి వస్తున్న కూటమి నాయకులను మీరు చేసిన అభివృద్ధి ఏందని ప్రజలు నిలదీసి అడగాలని హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి అన్నారు. కాంగ్రెస్, టీడీపీ దొందూ దొందేనని ఆ రెండు పార్టీల హయాంలో రాష్ట్రంలో జరిగిన అభివృద్ధి శూన్యమని పేర్కొన్నారు. పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి కాస్తా.. గడ్డంకుమార్‌రెడ్డిగా మారారని, తెలంగాణలో ఇక కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేది లేదని, ఉత్తమ్ గడ్డం తీసేది లేదని ఎద్దేవా చేశారు. జిల్లాలో అన్ని స్థానాల్లో టీఆర్‌ఎస్ అత్యధిక మెజారిటీతో గెలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
దేవుడసోంటి మనిషి పైళ్ల శేఖర్‌రెడ్డి :సర్వేల్లో తేలిందని చెప్పిన కేసీఆర్
సాక్షి, యాదాద్రి : ‘దేవుడసోంటి మనిషి పైళ్ల శేఖర్‌రెడ్డి. ప్రజలంతా శేఖర్‌రెడ్డి దేవుడు, ఆత్మీయుడు, ఆదుకుంటాడు’ అని చెప్పుకుంటున్నారని సర్వేల్లో తేలిందని ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. ఎవరి ఓటు వేస్తారని ప్రశ్నిస్తే.. పైళ్ల శేఖర్‌రెడ్డికని ప్రజలకు అందుబాటులో ఉంటాడని చెబుతున్నారని పేర్కొన్నారు. అలాంటి మనిషిని మనందరం గెలిపించుకోవాలని కోరారు. నాలుగున్నర ఏళ్లలో పైళ్ల శేఖర్‌రెడ్డి అద్భుతమైన ఎమ్మెల్యేగా పేరు తెచ్చుకున్నారని కొనియాడారు. భువనగిరిలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో బుధవారం జరిగిన ప్రజా ఆశీర్వాద సభలో ఆపద్ధర్మ సీఎం కేసీఆర్ మాట్లాడారు. శేఖర్‌రెడ్డి కంటే ముందు నా ఆత్మీయ మిత్రుడు, స్నేహితుడు ఎలిమినేటి మాధవరెడ్డిఅని.. అద్భుతంగా పనిచేసి భువనగిరికే కాకుండా జిల్లాలో గొప్ప నాయకుడిగా ఎదిగాడని అన్నారు. మాధవరెడ్డిలాగా ఏ ఇతర మంత్రులు పని చేయలేదన్నారు. తాను కరువు మంత్రిగా ఉన్నప్పుడు మాధవరెడ్డి భువనగిరి ఎమ్మెల్యేగా ఉన్నాడని, మున్సిపాలిటీలో నీటి సమస్య పరిష్కారం కోసం వార్డు వార్డుకూ తిరిగి 35 బోర్లు వేయించాడని గుర్తు చేశాడు. అలాంటి మాధవరెడ్డి స్థానంలో వచ్చిన పైళ్ల శేఖర్‌రెడ్డి ఆ లోటు భర్తీ చేస్తున్నాడని తెలిపారు. తాము చేసిన పలు సర్వేల్లో ఎవరికి ఓటేస్తారని అడిగితే చదువురాని వారు సైతం పైళ్ల శేఖర్‌రెడ్డికే వేస్తామని చెప్పారన్నారు.
Comments
Please login to add a commentAdd a comment