వ్యవసాయాన్ని అధోగతిపాలు చేశాయి
సాక్షి, హైదరాబాద్: దేశంలో వ్యవసాయాన్ని కాంగ్రెస్, బీజేపీలు అధోగతిపాలు చేశాయని తెలంగాణ రాష్ట్ర రైతు కార్పొరేషన్ చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి విమర్శించారు. ఈ దేశంలో రైతుని నాశనం చేసింది ఆ పార్టీలేనన్నారు. బుధవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కాంగ్రెస్ దక్షిణాది రాష్ట్రాల కిసాన్ సమావేశంలో వ్యవసాయాన్ని అధోగతిపాలు చేసింది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలేనని నేతలు మాట్లాడటంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. లోక్సభకు ఎన్నికలు సమీపిస్తున్నందున ఇప్పుడు పార్టీలన్నీ మొసలికన్నీరు కారుస్తున్నాయని విమర్శించారు. రైతును ప్రధాన కేంద్రంగా చూస్తున్నాయని ఆరోపించారు.
ఎవరు ఏనాడూ ఊహించని విధంగా సీఎం కేసీఆర్ వ్యవసాయ, ఆర్థిక విధానాలు దేశానికి దిక్సూచిలా మారాయన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మొదలుకొని వివిధ రాష్ట్రాలు ఇప్పుడు రైతుబంధు, రైతుబీమా పథకాలపై దృష్టిసారించారన్నారు. రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని అన్నారు. లీటరు పాలకు నాలుగు రూపాయలు ప్రోత్సాహకాన్ని అమలు చేస్తున్నామన్నారు. నాలుగున్నర ఏళ్ల పాలనలో ఎక్కడా ఎరువుల కొరత లేదనీ, నాణ్యమైన విత్తనాలు అందిస్తున్నామని ఆయన తెలిపారు. జాతీయ ఉపాధిహామీ పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేయాలని కేంద్రప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.