జీవీఎంసీ కౌన్సిల్.. 18 అజెండా, 27 సప్లిమెంటరీ అంశాలపై చర్చ!
విశాఖపట్నం: మేయర్ గొలగాని హరి వెంకటకుమారి అధ్యక్షతన సోమవారం ఉదయం 11 గంటల నుంచి నిర్వహించనున్న జీవీఎంసీ సర్వసభ్య సమావేశానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ నెల 6వ తేదీన కౌన్సిల్ సమావేశం జరగాల్సి ఉండగా.. మిచాంగ్ తుపాను కారణంగా వాయిదా పడింది. ఆ రోజు వాయిదా పడ్డ 18 అంశాలతో పాటు మరో 27 అంశాలు నేడు సభ్యుల ఆమోదానికి చర్చకు రానున్నాయి.
► 2023–24 ఏడాదిలో డిసెంబర్ 13 నుంచి మార్చి 31, 2024 వరకు జోన్–4 టౌన్‌కొత్తరోడ్డు వద్ద గల సీసీఎస్ ప్రాజెక్ట్ నిర్వహణలో భాగంగా అద్దె ప్రాతిపదికన టిప్పర్లు, బ్యాక్ హోయ లోడర్‌కు పరిపాలన ఆమోదం, ఎన్బీసీ, గ్రీన్ బిల్డింగ్ నిర్మాణపు మార్గదర్శకాలకు అనుగుణంగా అంచనా విలువ రూ.99.47 కోట్లతో ముడసర్లోవలోని 4.37 ఎకరాల్లో జీవీఎంసీ నూతన ప్రధాన కార్యాలయ నిర్మాణం కోసం ప్రభుత్వ పరిపాలన ఆమోదానికి సభ్యులు చర్చించనున్నారు.
► సాగర్‌నగర్‌కు ఎదురుగా బీచ్‌రోడ్డుకు ఆనుకొని ఉన్న బీచ్ స్థలంలో ఎకోఫ్రెండ్లీ తాబేలు బీచ్ అభివృద్ధి, ఉద్యానవన విభాగంలో గ్రీనరీ అభివృద్ధి, పర్యవేక్షణకు కాంట్రాక్ట్ పద్ధతిలో 8 మంది జోనల్ హర్టికల్చర్ అధికారుల నియామకం, పూర్ణామార్కెట్ జంక్షన్ నుంచి టౌన్‌కొత్తరోడ్డు జంక్షన్ వరకు రూ.1,34,02,077 అంచనా విలువతో రోడ్డుకిరువైపులా ఉన్న 55 ఫీడర్ పిల్లర్ బాక్స్‌లు, భూగర్భ విద్యుత్ కేబుల్ ఏర్పాటుపై చర్చించనున్నారు.
► రూ.1,46,45,690 అంచనా విలువతో రీడింగ్ రూమ్ జంక్షన్ నుంచి పాతపోస్టాఫీస్ జంక్షన్ వరకు 69 ఫీడర్ పిల్లర్ బాక్స్‌లు, భూగర్భ విద్యుత్ కేబుల్ ఏర్పాటు, రూ.62,01,254 అంచనా విలువతో చౌల్ట్రీ జంక్షన్ నుంచి పూర్ణామార్కెట్ జంక్షన్ వరకు 21 ఫీడర్ పిల్లర్ బాక్స్‌లు, భూగర్భ విద్యుత్ కేబుల్ ఏర్పాటు అంశాలు చర్చకు రానున్నాయి.
► పెదగదిలి జంక్షన్ వద్ద తూర్పు దిక్కున రూ.1.72కోట్లతో వంతెన నిర్మాణం, పడమర వైపున రూ.1.73 కోట్లతో వంతెన నిర్మాణం, కొత్త గాజువాక జంక్షన్ నుంచి వంటిల్లు జంక్షన్(కణితి రోడ్డు) వరకు 15వ ఆర్థిక సంఘం నిధులతో బీటీ హాట్ మిక్స్ రోడ్డు విస్తరణ, పునరుద్ధరణ పనులు, హైటెన్షన్ విద్యుత్ స్తంభాల మార్పుపై చర్చించనున్నారు.
► గుండాల జంక్షన్ వద్ద రూ.1,98,90,000తో జీ 2 తరహాలో జీవీఎంసీ గెస్ట్‌హౌస్ నిర్మాణం, పెందుర్తి పోలీస్ స్టేషన్ నుంచి రైల్వేస్టేషన్ వరకు హాట్మిక్స్తో బీటీ రోడ్డు పునరుద్ధరణ, పీఎఫ్ కాలనీలో బీటీ రోడ్డు పునరుద్ధరణ, 96వ వార్డు వేంకటేశ్వరస్వామి ఆలయ ఘాట్‌రోడ్డు హాట్మిక్స్తో బీటీ రోడ్డు పునరుద్ధరణ, 95వ వార్డు పురుషోతపురం వద్ద గల మహతి స్కూల్ నుంచి కంఫర్ట్ హోమ్స్ వరకు బీటీ రోడ్డు తదితర అంశాలను చర్చించి ఆమోదించనున్నారు.
► 90, 91, 92 వార్డుల్లో గిరి ప్రదక్షిణ రోడ్డు విస్తరణ, సెంటర్ డివైడర్లు, ఆర్సీసీ డ్రెయిన్లు, కల్వర్టుల నిర్మాణం, సమగ్ర మొబిలిటీ ప్లాన్ తయారీ, సీఎం ఈ–బస్ సేవా పథకం, మధురవాడ, పరిసర ప్రాంతాల్లో పారిశ్రామిక క్లస్టర్లు, గృహ అవసరాలకు 66 ఎంఎల్డీ నీటి సరఫరా, పంపిణీ, ముడసర్లోవలో నీటి శుద్ధి కర్మాగారం నిర్మాణంతో పాటు కేబీఆర్ నుంచి ట్రాన్స్మిషన్ మెయిన్, డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ ఏర్పాటుకు షరతులతో కూడిన విస్కో ప్రాజెక్ట్స్ తదితర అంశాలపై సభ్యులు చర్చిస్తారు.