ఆ సిండికేట్లదే పెత్తనం
- బినామీల పేరిట షాపులు
- అధికార ప్రజాప్రతినిధి సిండికేట్‌దే హవా
- స్లీపింగ్ పార్టనర్స్‌గా అధికార పార్టీ నేతలు
- జీవీఎంసీ పరిధిలోని షాపులపైనే గురి
సాక్షి, విశాఖపట్నం: ‘అధికారం’ చేతిలో ఉందని సిండికేట్లు రెచ్చిపోతున్నారు. మద్యం వ్యాపారంలో దశాబ్దాల అనుభవం ఉన్న అధికార పార్టీ ప్రజాప్రతినిధి కనుసన్నల్లోనే షాపుల పంపకాలకు రంగం సిద్ధమవుతోంది. ఇప్పటికే ఏడు సిండికేట్లు నగరంతో పాటు పరిసర ప్రాంతాల్లోని షాపులన్నీ గుప్పెట్లో పెట్టుకునేందుకు పావులు కదుపుతున్నాయి. జిల్లాలో 406 మద్యం షాపుల్లో 39 ప్రభుత్వం నిర్వహిస్తుంగా, మిగిలిన షాపులను 29న లాటరీలో కేటాయించనున్నారు.
ఈసారి లీజు కాలాన్ని రెండేళ్లుగా నిర్ణయించడంతో వ్యాపారులకు కలిసొస్తోంది. దీంతో వేలం పాటకు వ్యాపారులు పోటీపడుతున్నారు. నగర పరిధిలో ఏడు సిండికేట్లదే హవా. ఈ సిండికేట్ల గుప్పెట్లోనే మెజార్టీ షాపులున్నాయి. టీడీపీ ప్రజాప్రతినిధికి చెందిన సిండికేట్ ఇన్నాళ్లూ నగర పరిధిలో ఉండే సిండికేట్లలో ఒకటిగా ఉండేది. ఎవరికి వారు చక్రం తిప్పుకుంటూ మెజార్టీ షాపులను దక్కించుకునేందుకు ఈ సిండికేట్లు పోటీపడేవి. కానీ ప్రస్తుతం అధికారం టీడీపీ చేతిలో ఉండడం.
సదరు సిండికేట్ నాయకుడు అధికార పార్టీ ప్రజాప్రతినిధి కావడంతో ఈ రంగంలో పూర్తి పట్టు సాధించాలన్న పట్టుదలతో చక్రంతిప్పుతున్నారు. ఇతర సిండికేట్లు కూడా ఇప్పుడు ఈ ప్రజాప్రతినిధి కనుసన్నల్లోనే షాపులు దక్కించుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. దీంతో ఆ ప్రజాప్రతినిధి తన సిండికేట్‌కు మెజార్టీ షాపులను దక్కించుకోవడంతో పాటు సిండికేట్లపై కూడా పూర్తి పట్టు సాధించేందుకునేందుకు పావులు కదుపుతున్నారు.
సిటీ పరిధిలో 62 షాపులున్నాయి. పెందుర్తి, గాజువాక, అనకాపల్లి, భీమిలి వంటి ప్రాంతాల పరిధిలో ఉన్న మరో 95 షాపులతో పాటు నగర పరిధిలో న్న 60 బార్ అండ్ రెస్టారెంట్లు కూడా ఈ సిండికేట్ల పరిధిలోనే ఉన్నాయి. ఈసారి వీటిని తిరిగి దక్కించుకోవడంతో పాటు మరిన్ని షాపులను ైకైవసం చేసుకునేందుకు ఎత్తులు వేస్తున్నాయి. ఒక్కొక్క సిండికేట్ గరిష్టంగా షాపులు, బార్లు కలిసి 25 నుంచి 30 వరకు దక్కించుకునేందుకు పథకరచన చేశాయి. బినామీల పేరిట ఇప్పటికే పెద్ద ఎత్తున దరఖాస్తులు వేయిస్తున్నారు. కచ్చితంగా దక్కాల్సిన షాపుల కోసమైతే మరీ జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఆ షాపులకు దరఖాస్తులు ఎవరువేస్తున్నారో నిఘా పెట్టి వారికి నయానో.. భయానో తప్పుకునేలా చేస్తున్నారు. 62 షాపుల్లో 43 షాపులకు ఇప్పటి వరకు 106 దరఖాస్తులు రాగా, 53లక్షల లెసైన్సింగ్ ఫీజుగా వచ్చింది.