పోలీసుల 'పచ్చ'పాతం
అధికారానికి తలొగ్గారు!
► మున్సిపల్ ఉద్యోగి ఆత్మహత్య కేసులో టీడీపీ నేత పేరు చేర్చని పోలీసులు
► మున్సిపల్ ఆఫీసు ఎదుట ఉద్యోగులు, ఆవాజ్ కమిటీ రాస్తారోకో
► గంటన్నరసేపు స్తంభించిన ట్రాఫిక్ కమిషనర్ హామీతో ఆందోళన విరమణ
ఈమె పేరు షారాబాను. నంద్యాల మున్సిపాలిటీలో కాంట్రాక్టు వాటర్ వాల్వు ఆపరేటర్ హుసేన్‌సాబ్ భార్య. గుండలవిసేలా రోదిస్తున్న ఈమె కన్నీటి వెనుక అధికార పార్టీ నేత అహంకారం దాగుంది. టీడీపీ కౌన్సిలర్ భర్త అయిన ఆయన.. ఆ చిరుద్యోగిపై ఉరిమిన చూపునకు ఈమె జీవితంఅంధకారమైంది. ఓ మనిషి ప్రాణం తీసిన ఆ నేత విషయంలో పోలీసుల ‘పచ్చ’పాత ధోరణి స్పష్టంగా కనిపిస్తోంది.
నంద్యాల: బాధితుల పక్షాన నిలబడి న్యాయం అందించాల్సిన పోలీసులు అధికార పార్టీ నేతల ఒత్తిళ్లకు తలొగ్గారు. మున్సిపల్ కాంట్రాక్ట్ వాల్వ్ ఆపరేటర్ హుసేన్‌బాషా ఆత్మహత్యకు కారకుడైన ఎమ్మెల్యే భూమానాగిరెడ్డి అనుచరుడు, టీడీపీ నేత జేవీసీ ప్రసాద్ పేరును కేసు నుంచి పోలీసులు తప్పించారు. విచారణలో తేలితే కేసు నమోదు చేస్తామని పోలీసులు చెప్పి, చేతులు దులుపుకున్నారు. పోలీసుల తీరును నిరసిస్తూ ఆవాజ్ కమిటీ, మున్సిపల్ కాంట్రాక్ట్ కార్మికుల సంఘం శుక్రవారం మున్సిపల్ కార్యాలయం ఎదుట గంట సేపు ఆందోళన చేశాయి. నూనెపల్లె ట్యాంకు వద్ద వాల్వ్ ఆపరేటర్‌గా హుసేన్‌బాషా పని చేస్తున్నాడు.
ఈనెల 22వ తేదీ రాత్రి 9గంటల సమయంలో టీడీపీ నాయకుడు, కౌన్సిలర్ జేవీసీ హారిక భర్త ప్రసాద్ అక్కడికి వెళ్లి ‘నీటిని సక్రమంగా సరఫరా చేయడం లేదు.. అజాగ్రత్తగా వ్యవహరిస్తున్నావు.. నీ అంతు చూస్తా.. అంటూ దుర్భాషలాడాడు. భార్య సమక్షంలో దూషించడంతో మనస్థాపానికి గురైన హుసేన్‌బాషా గురువారం మధ్యాహ్నం ట్యాంకు వద్ద ఉన్న ఫాగింగ్‌కు వినియోగించే కెమికల్స్‌ను తాగి భార్యకు ఫోన్ చేసి అపస్మారక స్థితికి చేరుకున్నాడు. కుటుంబీకులు అక్కడికి చేరుకుని ఆసుపత్రికి తరలించారు. చికిత్స అనంతరం ఆయన కోలుకున్నాడు. అయితే రాత్రి వాంతులు అధికమై ఆరోగ్య పరిస్థితి విషమించడంతో కర్నూలు సర్వజన ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ శుక్రవారం తెల్లవారుజామున మృతి చెందాడు.
విచారణలో తేలాకే కేసు:
కాంట్రాక్ట్ వాల్వ్ ఆపరేటర్ హుసేన్‌బాషా ఆత్మహత్యకు సంబంధించిన కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న జేవీసీ ప్రసాద్‌పై త్రీటౌన్ పోలీసులు కేసు నమోదు చేయలేదు. గురువారం సాయంత్రం హుసేన్‌బాషా, అతని భార్య షారాబాను పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే కేసు నమోదు చేశామని, ఎవరి పేర్లు చేర్చలేదని సీఐ వెంకటరమణ తెలిపారు. ఆధారాలు లభ్యమైతే జేవీసీ ప్రసాద్‌పై కేసు నమోదు చేస్తామని చెప్పారు. ఈ విషయంపై జేవీసీ ప్రసాద్ మాట్లాడుతూ హుసేన్ బాషా ఆత్మహత్యకు తాను కారణం కాదని, రాజకీయంగా ఇబ్బంది పెట్టడానికి ప్రత్యర్థులు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.
మృతదేహంతో ఆందోళన
కర్నూలులో పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబీకులు శుక్రవారం సాయంత్రం నంద్యాల మున్సిపల్ కార్యాలయం వద్దకు తీసుకొచ్చారు. అప్పటికే సమాచారం అందుకున్న కాంట్రాక్ట్ కార్మికుల సంఘం కార్యదర్శి భాస్కరాచారి, ఉపాధ్యక్షుడు రామకృష్ణ, ఆవాజ్ కమిటీ అధ్యక్షుడు ముర్తుజా, డివిజన్ కార్యదర్శి అమ్జాద్‌బాషా సిద్ధిఖీ, సీపీఎం నాయకులు తోటమద్దులు, మస్తాన్‌వలి, మరికొందరు ముస్లిం మైనార్టీ నేతలు మున్సిపల్ కార్యాలయం వద్దకు చేరుకున్నా రు. మానవహారంగా ఏర్పడి రాస్తారోకో చేశారు. జేవీసీ ప్రసాద్‌ను అరెస్ట్ చేయాలని నినాదాలు చేశారు.
హుసేన్ కుటుంబానికి రూ.10 లక్షల ఆర్థిక సహాయాన్ని అందజేయాలని, అతని భార్యకు ఉద్యోగాన్ని ఇవ్వాలని డిమాండ్ చేశారు. దాదాపు గంటకు పైగా ట్రాఫిక్ స్తంభించిపోవడంతో పోలీసులు జోక్యం చేసుకున్నారు. టూటౌన్ సీఐ గుణశేఖర్ బాబు, ఎస్ఐ మోహన్‌రెడ్డి సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. ఆందోళనలో ఎమ్మార్పీఎస్ జిల్లా అధికార ప్రతినిధి కోలా కల్యాణ్, మరికొందరు ఎమ్మార్పీఎస్ నేతలు కూడా జత కావడంతో ఆందోళన ఉధృతమైంది. కమిషనర్ సత్యనారాయణరావు, పోలీస్ అధికారులు చర్చలు జరిపారు. జేవీసీ ప్రసాద్‌పై చర్యలు తీసుకొనేలా చూస్తామని, ఆర్థిక సహాయాన్ని అందజేస్తామని, కాంట్రాక్ట్ ఉద్యోగం ఇస్తామని హామీనిచ్చారు. దీంతో ఆందోళన విరమించారు.