భూకంపాలకు కేంద్రంగా హిమాలయాలు!
జెనీవా: హిమాలయ పర్వతశ్రేణుల్లో భారీ భూకంపాలు సంభవించే అవకాశం ఎక్కువగా ఉందని ఒక అధ్యయనంలో తేలింది. 2,400 కిలోమీటర్ల మేర ఉన్న పర్వత శ్రేణుల్లో ఈ భూకంపాలు వచ్చే ప్రమాదముందని, భారత్, చైనా సరిహద్దు మధ్యలోనున్న భూటాన్ కూడా భూకంప ప్రభావిత ప్రాంతంలో ఉందని పేర్కొంది.
భూటాన్ ప్రాంతం భారీ భూకంపాలు సంభవించేందుకు అనువైన ప్రాంతమని అధ్యయన నివేదిక రచయిత, స్విట్జర్లాండ్లోని లాసెన్నె యూనివర్సిటీకి చెందిన గియోర్గి హెతెన్యి తెలిపారు. భారీ భూకంపాలు సంభవించే సామర్థ్యం హిమాలయాలకు ఉందని, దీంతో పెద్ద ఎత్తున విధ్వంసం కూడా చోటు చేసుకునే అవకాశముందని పేర్కొన్నారు. 1714లోనూ భారీ భూకంపం భూటాన్లో సంభవించిందని, దీని గురించి పెద్దగా ఎవరికి తెలియదని తెలిపారు. దీనిని బట్టి భూటాన్ భారీ భూకంప ప్రభావిత ప్రాంతమని చెప్పవచ్చని అభిప్రాయపడ్డారు.
2015 ఏప్రిల్లో నెపాల్లో గోర్ఖా భూకంపం సంభవించిన విషయం తెలిసిందే. అయితే, 2400 కిలోమీటర్ల మేర విస్తరించిన ఉన్న హిమాలయ పర్వత శ్రేణుల్లోని ప్రతి ప్రాంతంలో భూకంప ప్రమాదం పొంచి ఉందని శాస్త్రీయ అధ్యయనం జరగలేదని, దానికి సంబంధించిన రికార్డులు కూడా అందుబాటులో లేవు. మిగతా ప్రపంచంతో పెద్దగా సంబంధాలులేకుండా భూటాన్ ఒంటరిగా ఉంటుందని, అక్కడికి శాస్త్రవేత్తలను కూడా చాలా అరుదుగా అనుమితిస్తుందని పేర్కొన్నారు.