కొరియా ముప్పు: మార్కెట్లు క్రాష్
సాక్షి, ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్లు ఈ వారాంతంలో భారీ నష్టాలతో ముగిశాయి. గ్లోబల్ మార్కెట్ల ప్రభావంతో ట్రేడింగ్ ప్రారంభం నుంచి మన మార్కెట్లు ఏమాత్రం కోలుకోలేదు సరికదా మరింత దిగజారాయి. మిడ్ సెషన్ తరువాత అమ్మకాలతో భారీగా కుదేలయ్యాయి. సెన్సెక్స్ 448 పాయింట్లు పతనంతో 31,923 వద్ద, నిఫ్టీ 158 పాయింట్లు క్షీణించి 9964 వద్ద ముగిసింది. కీలక సూచీలు రెండూ కీలక సాంకేతిక మద్దతు స్థాయిలకు దిగువకు చేరాయి. దీంతో గత 10 నెలల్లో ఇంట్రాడేలో అత్యంత గరిష్ట పతనాన్ని నమోదు చేశాయి.
డిసెంబర్లో వడ్డీ రేట్లను పెంచనున్నట్లు ఫెడరల్ రిజర్వ్ సూచనలు ఇవ్వడం, చైనా రేటింగ్ తగ్గించడం, రూపాయి మారకం విలువ ఆరు నెలల కనిష్టానికి పడిపోవడం, న్యూక్లియర్ వెపన్స్ లాంఛ్ చేస్తామని ఉత్తర కొరియా ప్రకటించడం.. మన మార్కెట్లపై పెను ప్రభావం చూపాయి.
టాటా స్టీల్ 4.72 శాతం, ఎల్ అండ్ టి 3.45 శాతం, ఐసిఐసిఐ బ్యాంక్ 2.89 శాతం, ఎస్బిఐ 2.53 శాతం, హీరోమోకో 2.48 శాతం, రిలయన్స్ ఇండస్ట్రీస్ 2.32 శాతం నష్టంతో టాప్ లూజర్స్‌గా నిలిచాయి. అటు డాలర్‌మారకంలో రూపాయి కూడా భారీగా పతనమైంది.