పాక్ ఉగ్రవాద సంస్థ జమాతుద్దావాను నిషేధించిన అమెరికా
అమెరికా ప్రభుత్వం పాక్ ఉగ్రవాద సంస్థ జమాతుద్దావాను నిషేధించింది. జమాతుద్దావా లష్కరే తోయబా కి మాతృసంస్థ. ముంబాయి లో 26/11 దాడులకు లష్కర్ సంస్థే కారణం.
ఈ నిషేధం లష్కర్ తో ముడిపడి ఉన్న జమాతుద్దవా సహా అల్ అన్ ఫల్, తహరీకె హుర్మతె రసూల్, తహరీకె తహఫూజ్ కిబ్లా అవ్వల్ వంటి సంస్థలకు కూడా వర్తిస్తుంది. ఈ నిషేధం వల్ల ఈ సంస్థకు వచ్చే నిధులు ఆగిపోతాయి. దీని కార్యకర్తలపై చర్యలు తీసుకోవడానికి వీలవుతుంది. ఇటీవలే అఫ్గనిస్తాన్ లోని హెరాత్ లో భారత రాయబార కార్యాలయంపై జరిగిన దాడికి కూడా లష్కర్ కారణమని అమెరికా ప్రకటించింది.
ఈ నిషేధం భారతదేశానికి ఒక ముఖ్యమైన దౌత్య విజయంగా భావించవచ్చు. భారత్ లష్కర్ ను ఉగ్రవాద సంస్థగా ప్రకటించడమే కాక, ఆ సంస్థ అధినేత హాఫెజ్ సయీద్ ను భారత దేశానికి 26 మంది ప్రధాన శత్రువుల్లో ఒకరిగా ప్రకటించింది. హాఫెజ్ ను తమకు ఇవ్వమని భారత్ పాకిస్తాన్ ను ఎప్పటి నుంచో కోరుతోంది. జమాతుద్దావాను నిషేధించాలని ఎప్పట్నుంచో భారత్ ఒత్తిడి తెస్తోంది.