జీహెచ్ఎంసీ అధికారులపై దాడి, కేసు నమోదు
బంజారాహిల్స్: ఆస్తిపన్ను వసూలు చేయడానికి వెళ్లిన జీహెచ్ఎంసీ అధికారులపై దాడికి పాల్పడిన ఘటన బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే....జీహెచ్ఎంసీ సర్కిల్-10(బి) అధికారులు శనివారం మధ్యాహ్నం బంజారాహిల్స్ రోడ్ నంబర్-14లోని మంజిల్ క్యాజిల్ అపార్ట్మెంట్స్లో ఆస్తిపన్ను వసూలు చేయడానికి వెళ్లారు. అయితే అపార్ట్మెంట్లో నివసించే ఖయ్యుం, హకీం అనే ఇద్దరు వారిని అసభ్య పదజాలంతో దూషించటంతోపాటు నెట్టేసేందుకు ప్రయత్నించారు.
దీనిపై అధికారి సురేష్ బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సదరు అపార్ట్మెంట్లో రూ.73,815 ఆస్తి పన్ను బకాయి ఉందని ఇప్పటికే చాలాసార్లు నోటీసులు జారీ చేయడం జరిగిందని సురేష్ చెప్పారు. తాజాగా నోటీసులకు సమాధానం చెప్పకపోవడంతో వసూళ్ల కోసం వెళ్లిన తమను అడ్డుకొని దాడి చేసేందుకు యత్నించారని ఆరోపించారు. బంజారాహిల్స్ పోలీసులు నిందితులపై ఐపీసీ సెక్షన్ 353, 506, 323 కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.