హెచ్ఏఎల్ చైర్మన్‌గా తెలుగువాడు
బాధ్యతలు స్వీకరించిన సువర్ణ రాజు
బెంగళూరు: ప్రభుత్వ రంగ దిగ్గజం హిందుస్తాన్ ఏరోనాటిక్స్ (హెచ్ఏఎల్) చైర్మన్‌గా తెలుగువాడైన టి. సువర్ణ రాజు (56) శనివారం బాధ్యతలు స్వీకరించారు. పదవీ విరమణ పొందిన ఆర్కే త్యాగి స్థానంలో ఆయన నియమితులైన సంగతి తెలిసిందే. టెక్నాలజీ దిగ్గజంగాను, విజ్ఞాన ఖనిగాను సంస్థను తీర్చిదిద్దడంపై దృష్టి పెడతానని బాధ్యతలు చేపట్టిన సందర్భంగా సువర్ణ రాజు తెలిపారు.
‘ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన మేక్ ఇన్ ఇండియా కార్యక్రమానికి తోడ్పడేలా కంపెనీని తీర్చిదిద్దడం నా లక్ష్యం. ఏరోస్పేస్ రంగంలో ఇది అనేక సవాళ్లతో కూడుకున్నదే అయినప్పటికీ శాయశక్తులా ప్రయత్నిస్తాను. అత్యుత్తమమైన టెక్నాలజీలను సొంతంగా తయారు చేసుకోవాల్సిందే తప్ప కొనుక్కోవడం వల్ల ప్రయోజనం లేదని నేను నమ్ముతాను’ అని ఆయన పేర్కొన్నారు.రాజు ఇప్పటిదాకా హెచ్ఏఎల్లో డెరైక్టర్‌గా (డిజైన్ అండ్ డెవలప్మెంట్ విభాగం) బాధ్యతలు నిర్వర్తించారు. దాదాపు రూ. 15,000 కోట్ల పైచిలుకు టర్నోవరు గల హెచ్ఏఎల్ చైర్మన్ పదవికి అయిదుగురు పోటీపడగా.. గతేడాది సెప్టెంబర్ 16న రాజును ప్రభుత్వ సంస్థల సెలక్షన్ బోర్డు (పీఈఎస్బీ) ఎంపిక చేసింది.
కంపెనీకి తొలి పేటెంటు ఘనత..
ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమ గోదావరి జిల్లా తణుకు దగ్గర్లోని పి. వేమవరం రాజు స్వగ్రామం. చెన్నై ఐఐటీలోను, నేషనల్ డిఫెన్స్ కాలేజీలోను ఆయన విద్యాభ్యాసం చేశారు. ఎంబీఏతో పాటు డిఫెన్స్ అండ్ స్ట్రాటెజిక్ స్టడీస్ అంశంలో మాస్టర్స్ ఆఫ్ ఫిలాసఫీ కూడా చదివారు. 1980 జూన్‌లో మేనేజ్మెంట్ ట్రైనీగా హెచ్ఏఎల్లో చేరారు. పరిశోధన, అభివృద్ధి కార్యకలాపాలకు సంబంధించి కంపెనీలో మొట్టమొదటిసారిగా విధానానికి, ఆర్అండ్డీ నిధికి రూపకల్పన చేశారు.
నిర్వహణ లాభాల్లో (పన్నుల అనంతరం) 10 శాతాన్ని ఆర్అండ్డీ నిధి కోసం పక్కన పెడుతోంది కంపెనీ. రాజు చొరవతోనే 2002లో హెచ్ఏఎల్ మొట్టమొదటి పేటెంటు దక్కించుకుంది. గడచిన రెండేళ్లలో హెచ్ఏఎల్ ఏకంగా 1,000 పైచిలుకు పేటెంట్ల కోసం దరఖాస్తు చేసింది. తేలికపాటి తేజాస్ విమానాలు, హాక్ ఎంకే 132 ఎయిర్‌క్రాఫ్ట్ మొదలైన వాటి రూపకల్పన, తయారీలో రాజు కీలకపాత్ర పోషించారు. ప్రాజెక్టు ఖర్చు పెరిగిపోకుండా సరైన సమయానికి డెలివరీలు ఇచ్చేలా మిరేజ్ 2000 ఎయిర్‌క్రాఫ్ట్‌ల మెయింటెనెన్స్ ప్రాజెక్టుకు ఆయన సారథ్యం వహించారు. ప్రస్తుతం నేషనల్ ఏరోనాటిక్స్ కోఆర్డినేషన్ గ్రూప్ మెంబర్ సెక్రటరీగా కూడా ఆయన ఉన్నారు.