డిస్నీలో పండోరా వండర్స్
మీరు అవతార్ సినిమా ఫ్యాన్సా? అయితే వెంటనే చలో కెనడా అనేయండి మరి. అక్కడి వాల్ట్ డిస్నీ వరల్డ్ రిసార్ట్‌లో అవతార్ సినిమాలోని పండోరా గ్రహం నకలు సిద్ధమైపోయింది. వేలాడే కొండలు.. మిణుగురు పురుగుల్లా రకరకాల రంగుల్లో మిలమిలా మెరిసే అడవులు ఈ రిసార్ట్‌లోని ‘పండోరా.. వరల్డ్ ఆఫ్ అవతార్’లో కనువిందు చేయనున్నాయి. ఈ ఫొటోల్లోని సీన్స్ అక్కడివే! మొత్తం 12 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న పండోరా వరల్డ్ ఆఫ్ అవతార్‌లో ఎన్నో థ్రిల్లింగ్ రైడ్స్ ఉన్నాయి. వాల్ట్ డిస్నీ దీని నిర్మాణాన్ని పూర్తి చేసేందుకు ఆరేళ్ల సమయం తీసుకుందీ అంటే.. దీంట్లోని సంక్లిష్టత ఎలాంటిదో.. ఎంత అద్భుతంగా ఉంటుందో ఇట్టే ఊహించుకోవచ్చు.
పడవెక్కి నావీ నదిలో షికారు చేయడం.. గుహల్లోపల మొక్కలు, చెట్లూ అన్నీ మెరిసిపోతూంటే మురిసిపోవడం, వేలాడే కొండలు హలెలూయా మౌంటెన్స్‌ను చూడటం మాత్రమే కాదు.. అవతార్ సినిమాలో మాదిరిగా బాన్షీ.. అదేనండి పే...ద్ద రెక్కలున్న పక్షులు.. వాటిపై ఎక్కి చక్కర్లు కొట్టవచ్చు కూడా! ‘అవతార్ ఫ్లైట్ ఆఫ్ పాసేజ్’లో విజిటర్లు ఒక బైక్ సిములేటర్‌లో కూర్చుంటే.. ఒక్కొక్కరి వర్చువల్ అవతారం స్క్రీన్‌పై ప్రయాణిస్తూ... వ్యాలీ ఆఫ్ మోర్ మొత్తాన్ని చూపుతుంది. త్రీడీ, ఆగ్మెంటెడ్ రియాలిటీ తదితర హైటెక్ టెక్నాలజీల పుణ్యమా అని ఆ సమయంలో లోయ మొత్తం మన కాళ్ల కిందే కదులుతున్నట్లు.. బాన్షీలు మన పక్క నుంచే ఎరుగుతున్న అనుభూతి కలుగుతుంది.
– సాక్షి నాలెడ్జ్ సెంటర్