16 నుంచి కేయూ దూరవిద్య పీజీ పరీక్షలు
ఇంకా అందుబాటులోకి రాని హాల్‌టికెట్లు
గడువు ముగిశాక కూడా అడ్మిషన్లు ఇచ్చిన అధికారులు
కేయూ క్యాంపస్ : కాకతీయ యూనివర్సిటీ దూరవిద్య పీజీ కోర్సులు ప్రీవియస్, ఫైనల్ ఇయర్ పరీక్షలను ఈనెల 16వ తేదీ నుంచి నిర్వహించనున్నారు. ఎంఏ, ఎంకాం, హెచ్ఆర్ఎం, రూరల్ డెవలప్మెంట్, ఎల్ఎల్ఎం, ఎమ్మెస్సీ మ్యాథ్‌మెటిక్స్ కోర్సుల ప్రీవియస్ పరీక్షలు ఈనెల 16, 18, 20, 23, 25వ తేదీల్లో, ఫైనల్ ఇయర్ పరీక్షలు ఈనెల 17, 19, 22, 24, 26వ తేదీల్లో నిర్వహించేందుకు కేయూ పరీక్షల విభాగం అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఆయా తేదీల్లో మధ్యాహ్నం 2నుంచి సాయంత్రం 5గంటల వరకు పరీక్షలు జరుగుతాయని అధికారులు తెలిపారు. పీజీ ప్రీవియస్ పరీక్షలను 7,465మంది, ఫైనల్ ఇయర్ పరీక్షలను 5,937మంది రాయనుండగా, టైంటేబుల్‌ను కేయూ ఎస్డీఎల్సీఈ వెబ్సైట్లో అందుబాటులో ఉంచారు.
హాల్‌టికెట్లు ఏవీ?
పరీక్షల నిర్వహణకు రెండు రోజులే గడువు ఉన్నా అభ్యర్థుల హాల్‌టికెట్లు శనివారం రాత్రి వరకు కూడా వెబ్సైట్లో అందుబాటులో లేవు. విద్యార్థులు తమ హాల్‌టికెట్లను వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలని సెల్ఫోన్ల ద్వారా మెసేజ్‌లు పంపించిన అధికారులు ఆచరణలోకి వచ్చే సరికి నిర్లక్ష్యంగా వ్యవహరించారు. ఈ విషయమై దూరవిద్య కేంద్రం డెరైక్టర్ ప్రొఫెసర్ డి.రాజేంద్రప్రసాద్‌ను వివరణ కోరగా సోమవారం వరకు ఎస్డీఎల్సీఈ వెబ్సైట్లో హాల్‌టికెట్లు అందుబాటులో ఉంచుతామని తెలిపారు. అంతేకాకుండా పరీక్ష కేంద్రాల వద్ద హాల్‌టికెట్లు ఇస్తామని, ఒక రోజు ముందు విద్యార్థులు వాటిని తీసుకోవచ్చని సూచించారు.
ఇష్టారాజ్యంగా ప్రవేశాలు
కాకతీయ యూనివర్సిటీ దూరవిద్య పీజీ ప్రీవియస్, ఫైనల్ ఇయర్ పరీక్షల టైంటేబుల్‌ను అధికారులు కొద్దిరోజుల క్రితమే వెల్లడించారు. అయితే, పరీక్షల తేదీకి నాలుగైదు రోజుల ముందు కూడా పీజీ ప్రీవియస్ కోర్సుల్లో పలువురికి ప్రవేశాలు కల్పించారనే విమర్శలు వస్తున్నాయి.
కొంతకాలం క్రితమే అడ్మిషన్ల ప్రక్రియకు గడువు ముగియగా.. విషయం తెలియని కొందరు విద్యార్థులు ప్రవేశాల కోసం ఎస్డీఎల్సీఈకి వస్తే అధికారులు తిప్పిపంపించారు. కానీ ఒకటి, రెండు స్టడీ సెంటర్ల నుంచి వచ్చిన వారికి మాత్రం నాలుగు రోజుల క్రితం వరకు పీజీ ప్రీవియస్‌లో అడ్మిషన్లు ఇచ్చినట్లు సమాచారం. దీంతో ప్రవేశాలు పొందిన వారం లోపే ఆయా అభ్యర్థులు పరీక్షలు రాయనుండడం గమనార్హం. ఎస్డీఎల్సీఈ పీజీ కోర్సుల్లో ప్రవేశాలు పొందిన వారికి తప్పకుండా తరగతులకు హాజరుకావాలనే నిబంధన ఉంది.
కానీ ఈ నిబంధనను విస్మరించి ఫీజులు వస్తే చాలునన్న చందంగా అధికారులు ప్రవేశాలు కల్పిస్తుండడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇక కొందరు ఎంఓయూ సెంటర్ల నిర్వాహకులు ప్రవేశాలు లేకున్నా అభ్యర్థులతో పరీక్షలు రాయిస్తున్నారనే ఆరోపణలు గతంలో వచ్చాయి. ఇలాంటి వాటికి చెక్ పెట్టేందుకు కేయూ అధికారులు ఇప్పటికైనా నిబంధనలను పకడ్బందీగా అమలుచేయాలని పలువురు కోరుతున్నారు.