అదనపు భారం
- హమాలీ చార్జీల భారం రైతులకు తప్పదా
- ఇక పై క్వింటాకు రూ.15.28 చొప్పున చెల్లించాల్సిందే
- ఈ సీజన్ నుంచే అమల్లోకి తెచ్చిన అధికారులు
- కొనుగోలు కేంద్రాల్లో ఇంకా తప్పని తిప్పలు
నల్లగొండ : అన్నదాత నెత్తిన మరో భారం పడింది. ప్రభుత్వం లెవీ తగ్గింపుతో పండిన పంటకు మద్దతు ధర లభించక తీవ్రంగా నష్టపోతున్న రైతాంగంపై సివిల్ సప్లయ్ అదనపు భారం మోపింది. నాణ్యత, తేమ, తూకం పేరుతో ఇప్పటికే నష్టపోతున్న రైతులు ఇక నుంచి హమాలీ చార్జీల భారాన్ని సైతం మోయక తప్పదు. ప్రస్తుత రబీ సీజన్ నుంచే ఈ చార్జీల చెల్లింపులను అమల్లోకి తీసుకొచ్చారు. క్వింటాకు అదనంగా రూ.15.28 చొప్పున హమాలీ చార్జీలను రైతులు చెల్లించాల్సి ఉంది.
ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో విక్రయించిన ధాన్యానికి క్వింటాకు రూ.20 చొప్పున హమాలీ చార్జీలు చెల్లించాలి. ఇందులో గతేడాది ఖరీఫ్ సీజన్ వరకు రూ.10 రైతులు చెల్లిస్తే.. మిగిలిన రూ.10 ధాన్యం కొనుగోలు చేస్తున్న సివిల్ సప్లయ్ కార్పొరేషన్ భరించేది. ఇక పై క్వింటాకు రూ.4.72లకు ఎక్కువ చెల్లించేది లేదని, రైతుల ముంగిట్లోనే ధాన్యం కొనుగోలు చేస్తున్నందున మిగిలిన మొత్తాన్ని రైతులే చెల్లించాలని సివిల్సప్లయ్ కార్పొరేషన్ నిర్ణయించింది. ఇప్పటికే తేమ శాతం 17 మించితే.. ఒక్కో శాతానికి కిలో చొప్పున తూకంలో కోతపెడుతున్నారు. కొత్తగా ఈ హమాలీ చార్జీల కారణంగా రైతులు మరింత భారాన్ని మోయక తప్పదు.
సమస్యల వలయంలో కొనుగోలు కేంద్రాలు
ఐకేపీ, పీఏసీఎస్ కేంద్రాల్లో బుధవారం సాయంత్రం వరకు 1,53,547 టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశారు. దీంట్లో ఐకేపీ కేంద్రాల్లో 80,709 టన్నులు కాగా, పీఏసీఎస్ కేంద్రాలు 72,838 క్వింటాళ్లు కొన్నారు. ఈ ధాన్యం విలువ రూ.214 కోట్లు. దీంట్లో రైతులకు రూ.95 కోట్లు చెల్లించారు. ఇంతవరకు బాగానే ఉన్నా.. కొనుగోలు కేంద్రాల్లో సౌకర్యాలు కల్పించడంలో మాత్ర ం అధికారులు విఫలమయ్యారు. 50 లక్షల గన్నీ బ్యాగులు అందుబాటులో ఉన్నాయని అధికారులు చెబుతున్నారు.
అయితే దీంట్లో పది లక్షల బ్యాగుల వరకు సరిగా లేవని చిల్లులు, పాతవి వచ్చాయని కొనుగోలు కేంద్రాల నుంచి ఫిర్యాదులు వచ్చాయి. టార్పాలిన్లు కూడా కేంద్రాల కొనుగోలు సామర్థ్యాన్ని బట్టి కాకుండా హెచ్చుతగ్గులు ఉండటంతో అనేక సమస్యలు వస్తున్నాయి. ఈ సీజన్లో జిల్లా వ్యాప్తంగా 165 ఐకేపీ కేంద్రాలు ఏర్పాటు చేయాల్సి ఉండగా ఇప్పటి వరకు 146 కేంద్రాల్లో ధాన్యం కొనుగోళ్లు జరుగుతున్నాయి. పూర్తిస్థాయిలో కేంద్రాలు ఆరంభమైతే ఈ సమస్యలు మరింత ఎక్కువయ్యే అవకాశం లేకపోలేదు. టార్పాలిన్లు, గన్నీ బ్యా గులు సప్లయ్ చేయడంలో అధికారులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోపోవడం వల్లనే ఇలాంటి సమస్యలు తలెత్తుతున్నాయని ఐకేపీ కేంద్రాల నిర్వాహకులు వాపోతున్నారు.