లలిత్‌కు తొలి ఓటమి
అల్ అయిన్ (యూఏఈ) : ఆసియా కాంటినెంటల్ చెస్ చాంపియన్‌షిప్‌లో ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్ లలిత్ బాబుకు తొలి ఓటమి ఎదురైంది. వరుసగా తొలి రెండు రౌండ్లలో నెగ్గిన లలిత్, మంగళవారం జరిగిన ఓపెన్ విభాగం మూడో రౌండ్లో భారత్‌కే చెందిన విష్ణు ప్రసన్న చేతిలో 36 ఎత్తుల్లో ఓడిపోయాడు. ఓపెన్ విభాగంలోనే ఆడుతున్న తెలుగు గ్రాండ్‌మాస్టర్లు కోనేరు హంపి తొలి ‘డ్రా’ నమోదు చేసుకోగా... ద్రోణవల్లి హారిక తొలి విజయాన్ని సాధించింది. హంపిని రత్నకరణ్ (భారత్) నిలువరించగా... జు యి (చైనా)పై హారిక గెలిచింది. మూడో రౌండ్ తర్వాత భారత ఆటగాళ్లు సూర్యశేఖర గంగూలీ, విష్ణు ప్రసన్న మూడేసి పాయింట్లతో సంయుక్తంగా అగ్రస్థానంలో ఉన్నారు.