ఈతరాని చేపలు..!
చేప అంటే నీటిలో ఈది తీరాలి? కానీ ఈతరాని చేపలున్నాయంటే నమ్ముతారా! నిజమండీ..‘హ్యాండ్ ఫిష్లు’ ఆ రకమే. ఇవి ఈదలేవు. సముద్రం అట్టడుగు మట్టంపై చేతులతో నడుస్తాయి. చేపకు మొప్పలుంటాయి కానీ చేతులేంటి? అదే వీటి ప్రత్యేకత. వీటికి మొప్పల స్థానంలో బలమైన కండరాలు పొడుచుకు వచ్చి ఉంటాయి. అచ్చం చిన్నచిన్న చేతుల్లాగా. వాటితో నడుస్తాయి. ఆస్ట్రేలియా సముద్రాల్లో మాత్రమే కనిపించే ఈ నడిచే చేప ఈదలేకపోవడానికి కూడా కారణం ఇదే. ఇవి ఇలా నడుచుకుంటూ నీటి అడుగున ఉండే చిన్నచిన్న జీవులను ఆహారంగా తీసుకుంటాయి. ఇవి మొత్తం 14 జాతులున్నాయి. 10 సెంటీమీటర్లుండే ఈ చేప చూడటానికి చాలా అందంగా కనిపిస్తుంది. ముప్పు పొంచి ఉన్న జీవుల్లో ఇది కూడా ఒకటి. దాదాపు 5 కోట్ల ఏళ్ల క్రితం ఈ చేపలు ప్రపంచవ్యాప్తంగా అన్ని సముద్రాల్లో ఉండేవట. వాతావరణ కాలుష్యం, వేట, సముద్ర ఉష్ణోగ్రతల పెరుగుదల వల్ల ఇవి క్రమంగా అంతరించిపోయాయి.
బ్యాట్ఫిష్ కూడా..: ఇలా నడిచే చేపల జాబితాలో బ్యాట్ఫిష్లు కూడా ఉన్నాయి. అరచేతుల్లో ఇమిడేంత పరిమాణంలో ఉండే ఇవి అట్టడుగు సముద్ర తలంపై చకచకా నడిచేస్తాయి. వీటికి దృఢమైన భుజాలాలంటి మొప్పలు ఉన్నాయి.