నేతన్నకు ఏదీ చేయూత?!
చేనేత రంగానికి ప్రభుత్వం సాయం చేసినా, చేయకపోయినా, అది నేటికీ నిలబడి బతుకుతోందంటే, దానికున్న జనాదరణ ఎటువంటిదో, అది ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. చేనేతకు ప్రస్తుత పరిస్థితుల్లో అత్యవసరమైంది ‘సంక్షేమం’. సంక్షేమానికి పూర్తిగా క్షామం పట్టించారు మన కేంద్ర పాలకులు..
దేశంలో చేనేత పరిశ్రమ సంక్షోభంలో ఉన్నదన్న విషయం జగద్విదితం. దేశ వ్యాప్తంగా 44లక్షల మంది చేనేత వృత్తిపై ఆధారపడి బతుకు సాగిస్తున్నారు. అవిభక్త ఆంధ్రప్రదేశ్‌లో దాదాపు 2.20 లక్షల కుటుంబాలు ఈ రంగంలో ఉపాధి పొందేవి. వ్యవసాయ రంగం తరువాత రెండో అతిపెద్ద ఉపాధి కల్పనదారుగా చేనేత పరిశ్రమ నిలుస్తోంది. స్వాతంత్య్రం వచ్చిన 6 దశాబ్దాల తరువాత కూడా చేనేత కార్మికుల్లో 15శాతం మంది మాత్రమే సహకార సంఘాల పరిధిలో ఉన్నారు. మిగిలిన వారంతా ఆసంఘటిత కార్మికులే. పదివేల సంవత్సరాల మనుగడ తరువాత కూడా చేనేత కార్మికుల పరిస్థితి గౌరవ ప్రదంగా లేకపోవడం శోచనీయం.
లక్షలాది పేద చేనేత కార్మిక కుటుంబాలు నిత్య దరి ద్రంలో కునారిల్లుతున్నది నిజం. అటువంటి ‘చేనేత పరిశ్ర మ’కు ఈ ఆర్థిక సంవత్సరంలో బడ్జెట్ కేటాయింపులు చూస్తే నోరు పెగలడం లేదు. ప్రతి సంవత్సరం చేనేత పరిశ్రమలో సంక్షోభం పెరుగుతుంటే ప్రతి బడ్జెట్లో నిధులు తరిగిపోతు న్నాయి. ఇదొక విచిత్ర పరిస్థితి. ప్రత్యేకంగా చేనేత చేసుకున్న పాపమేమో తెలియదు.
2013లో ఆనాటి ప్రభుత్వం చేనేతకు రుణమాఫీ పథకం ప్రవేశపెట్టి కేటాయించిందెంతైనా కావచ్చు కానీ ఖర్చు మాత్రం రూ. 291 కోట్లు. వెంటనే ఆ తరువాత సంవత్సరం రూ 157 కోట్లకు కుదించారు. ఇప్పటికే రుణమాఫీ లబ్ధి అందని చేనేత కుటుంబాలు చాలా వున్నాయి. తరువాత కిస్తీలో వస్తాయని అధికారులు చెప్పుకుంటూ వచ్చారు. కార్మికులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. వాస్తవంగా, చేనేత కార్మిక కుటుంబాలు ముందు కంటే ఇప్పుడే పీకల్లోతు కష్టాల్లో ఉన్నాయి. సాయం కోసం ఆశగా ప్రభుత్వాల వైపు చూస్తున్నాయి.
అటు దేశానికి వెన్నెముక లాంటి వ్యవసాయానికి, రైతాంగానికి సబ్సి డీలపై కోతకు సిద్ధపడటమే కాదు ఇటు స్వయం ఉపాధి రంగంలో అత్యధిక భాగంగా ఉన్న చేనేత రంగాన్ని తీవ్ర నిర్లక్ష్యానికి, నిరాదరణకు గురి చేసిన వైనం ఏ విధంగానూ సమర్థనీయం కాదు. కేంద్రంలో నూతన ప్రభుత్వ పగ్గాలు చేపట్టింది స్వల్ప కాలమే అయినా, సరిగ్గా కాలు నిలదొక్కుకోలేక పోయినా, వేసింది మొదటి అడుగైనా అది ముందడుగు కావాలి. ఏ మాత్రమైనా అభివృద్ధి వైపు సాగాలి. ప్రజలకు నమ్మకం కలిగించాలి.
ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ బడ్జెట్లో రుణమాఫీ ప్రస్తావనే లేదు. పూర్తిగా ఎత్తేశారు. రుణం అందని వారి బాధ చెప్పనలవికాదు. అధికారులు మాత్రం వస్తుంది రుణమాఫీ చేస్తామని జోకొట్టారు. నెట్టుకొచ్చారు. ఇప్పుడు ఏమి చెప్పినా ప్రయోజనం శూన్యం. మరొక ముఖ్యమైన విషయం. చేనేతకు ప్రస్తుత పరిస్థితులలో అత్యవసరమైంది ‘సంక్షేమం’. సంక్షేమానికి పూర్తిగా క్షామం పట్టించారు మన కేంద్ర పాలకులు. సంక్షేమ పథకాలు అవసరం లేనంతగా చేనేత అభివృద్ధి చెందిందనుకున్నారో? లేక అక్కడకు రాగానే కన్ను చెదిరిందో, చేయి అదిరిందో తెలియదు కానీ దాన్ని పూర్తిగా ఎత్తేశారు. ఇప్పటి వరకు క్రమంగా నిధులు తగ్గించుకుంటూ వస్తున్నారు. ఇప్పుడు ఏకంగా రద్దు చేశారు.
ఇదంతా చూస్తుంటే గతం గుర్తుకొస్తుంది. చేనేత రంగం పట్ల వివక్ష, ప్రతికూల విధానం బీజేపీ (ఎన్డీఏ) ప్రభుత్వాలకు వారసత్వంగా వస్తుందేమోననిపిస్తుంది. గతంలో వాజ్‌పేయి ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు చేనేత, జౌళిరంగంపై ప్రొఫెసర్ ఎస్ఆర్ సత్యం గారితో ఒక కమిటీ వేశారు. ఆ కమిటీ నివేదిక విప్పిచూస్తే ఏముంది. పూర్తిగా చేనేత వ్యతిరేక విధానాలతో రూపకల్పన చేయబడింది. రాష్ట్రవ్యాపితంగా చేనేత వర్గాలు భగ్గున లేచాయి. సత్యం కమిటీ సిఫార్సులకు వ్యతిరేకంగా ఉద్యమించాయి. చేనేతకు ప్రాణాధారమైన చిలపలనూలు, మిల్లులు తయారు చేయనక్కర్లేదని, గుంట మగ్గం వదిలేసి యాంత్రీకరణకు మారి అంతర్జాతీయ స్థాయికి ఎదగమని, ఇలాంటి సిఫార్సులతో చేనేతను రూపుమాపాలనే ప్రయత్నమొకటి ఆనాడే చేశారు.
అన్ని చేనేత సంఘాల ప్రతినిధులు కలసి ఢిల్లీ వెళ్లి అప్పటి ప్రధాని వాజ్‌పేయి గారిని కలసి సత్యం కమిటీ సిఫార్సులు నిలిపి వేయాలని వేడుకోవాల్సి వచ్చింది. అంతటితో వదిలి పెట్టకుండా మళ్లీ అదే చిలపలనూలుపై 9.2 శాతం ఎక్సైజ్ సుంకం విధించారు. ఆ సుంకం రద్దు చేయించడానికి మళ్లీ పోరాటాల బాట పట్టాల్సి వచ్చింది. ఎన్ని పోరాటాలు చేసినా ప్రయోజనం లేకపోయింది. ఇంతలో రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారానికొచ్చింది. దివంగత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి ఆ సుంకాన్ని రద్దు చేయించారు. ఈ చేదు అనుభవాలు గతమైనా పునరావృతం అవుతాయని భయంగానే వుంది.
అసలు చేనేతకు నిధులెందుకు తగ్గిపోతున్నాయి? నిజంగా అవకాశం లేకనా? కేటాయించాలన్న ఉద్దేశం లేకనా? యంత్రాల ఆధారంగా జరిగే జౌళి ఉత్పత్తుల రంగానికి ప్రభుత్వాల పెట్టుబడులు పెరుగుతూనే ఉన్నాయి. సబ్సిడీలు దోచిపెడుతున్నారు. పన్నుల రాయితీలు గుప్పిస్తున్నారు. ఏ పార్టీ ప్రభుత్వమైనా జరిగేదదే. దానికి పార్టీల తేడా లేదు. వివక్షత ఒక్క చేనేతకేనన్నది చరిత్ర చెప్పిన సత్యం. అసలిదంతా ఎందుకు? ఆధునిక మర మగ్గాలు, మిల్లులు ఏ సబ్సిడీలు లేకుండా తమంత తమ కాళ్లమీద నిలదొక్కుకోమనండి చూద్దాం! గడచిన పది సంవత్సరాలలో జౌళిరం గంలో పెట్టుబడులు పెట్టింది రాజకీయ పెద్దలు కావడంతో, ప్రభుత్వాల మద్దతు పుష్కలంగా లభించడం పరిపాటైంది. లక్షల కోట్లు సబ్సిడీలు తమ వారికి అందించినా, జౌళిరంగమేమీ అభివృద్ధి చెందలేదు. దాని అభివృద్ధి 14 శాతం నుండి 5 శాతానికి పడిపోయింది. ఇదే సమయంలో చేనేత రంగానికి ప్రభుత్వం సాయం చేసినా, చేయకపోయినా, అది నిలబడి బతుకుతోందంటే, దానికున్న జనాదరణ ఎటువంటిదో, అది ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. చేనేత రంగ ఉత్పత్తులకు, మరమగ్గాల ఉత్పత్తులకు మధ్య పెద్ద వైరుధ్యమే వుంది. చేనేతకున్న రిజర్వేషన్ చట్టాన్ని నిత్యం ఉల్లంఘించుతూ నకిలీ వస్త్రాలు తయారు చేసి, చేనేత మార్కెట్‌ను ధ్వంసం చేస్తుంటే కంటితో చూస్తూ ఊరుకోవడం... చేనేత కార్మికులు అరుస్తుంటే పట్టించుకోకపోవడం ఉద్దేశపూర్వకంగానే జరుగుతోంది. పాలకులకు ఆధునిక మరమగ్గాలపై వున్న మక్కువ, చేనేతపై లేకపోవడమే దురదృష్టం.
అభివృద్ధికి ఆమడదూరంలో వుండి దాని ఉనికి క్షేత్రస్థాయిలో చేనేత శ్రమజీవులకు తెలియని, దాని పేరు కూడా తెలియని సంస్థ ‘జాతీయ చేనేత అభివృద్ధి’ సంస్థ. ఆ పద్దు కింద మొత్తం బడ్జెట్లోనే అధికశాతం నిధులు పెట్టారు. రూ 292 కోట్లు పెట్టారంటే సంతోషించలేము. ఆ పెట్టిన నిధులు ఏ అభివృద్ధ్ధికి ఖర్చు చేస్తారో? ఎవరిని అభివృద్ధి చేస్తారో, ఆ నిధులు విడుదల చేస్తారో? లేదో అంతు చిక్కని ప్రశ్న. ఈ అంకెల గారడీ బడ్జెట్లు గతంలో ఎన్ని చూడలేదు. బడ్జెట్లో నిధులు పెట్టినా, ఖర్చుచేయరాదనుకుంటే .. కఠిన మార్గదర్శకాలు పెట్టి, ఏవో అడ్డంకులు కల్పించి, తీవ్రజాప్యం చేసి చేనేతకు ప్రభుత్వం నుండి ఏ సహాయం అందక, పరిశ్రమ కుంటుపడి కార్మికులు వలసబాట పట్టడం, వర్తమాన చరిత్రలో చేనేతకు జరుగుతున్న ఘోరమైన అన్యాయం.
నూతనంగా ఎన్నికై, దేశాన్ని అభివృద్ధి పథంలో నడుపుతానన్న ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ నాయకత్వంలో ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ పార్లమెంట్లో ప్రవేశపెట్టిన బడ్జెట్లో చేనేతకున్న అనేక పథకాలకు నిధులు కోత పెట్టి, కొన్ని రద్దుచేసి గత ప్రభుత్వం కంటే ఘనత వహించారు. సామాన్యుడికి ప్రతీకగా, చాయ్‌వాలాగా ప్రచారం సాగించుకున్న మోడీ, విస్తృత ఖర్చుతో తనను ఆకాశానికెత్తి, అందలమెక్కించిన కార్పొరేట్ శక్తులకు, సంస్థలకు రెడ్ కార్పెట్ పరచి, వారి రుణం తీర్చుకోవడమే ప్రథమ కర్తవ్యంగా భావించి, సాధ్యమైనంతగా నిధులు వండి వార్చడానికి, సామాన్య చేనేత కార్మికుల ప్రయోజనాలను పణంగా పెట్టడమే పెద్ద విషాదం.
(వ్యాసకర్త ఆంధ్రప్రదేశ్ చేనేత కార్మిక సంఘం పూర్వ అధ్యక్షులు) - అందె నరసింహారావు