అత్యాచారం.. కాళ్లు చేతులు కట్టేసి హత్య!
దేశరాజధానిలో మహిళలకు రక్షణ లేకుండా పోతోంది. దక్షిణ ఢిల్లీలోని వసంత్ కుంజ్ ప్రాంతంలో 30 ఏళ్ల మహిళను అర్ధనగ్నంగా చేతులు కాళ్లు కట్టేసి చంపేశారు. ఆమె మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆమెపై అత్యాచారం చేసిన తర్వాతే చంపేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. ఓ సెక్యూరిటీ గార్డు ఆమె మృతదేహాన్ని చూసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆమె ఫతేపుర్బేరి ప్రాంతానికి చెందినవారని గుర్తించామని, మిగిలిన వివరాలు పోస్టుమార్టం తర్వాతే తెలుస్తాయని డీసీపీ ప్రేమ్ నాథ్ తెలిపారు.
ఆమె శుక్రవారం ఉదయమే ఇంటినుంచి బయటకు 9.30 గంటల ప్రాంతంలో వెళ్లారు. అయితే ఇంటికి మాత్రం సాయంత్రం కూడా తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు అన్నిచోట్లా గాలించి, చివరకు పోలీసులకు ఫిర్యాదు చేశారు. చివరకు సెక్యూరిటీ గార్డు ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు.. ఆమె మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఆమె ధరించిన దుస్తులతోనే ఆమె చేతులు, కాళ్లు కట్టేసి ఉన్నాయి. ఆమెపై సామూహిక అత్యాచారంచేసి హతమార్చినట్లు తెలుస్తోందని పోలీసులు చెప్పారు.