మ్యూజిక్‌తో హ్యాంగోవర్ పరార్..
వారాంతాల్లో పబ్‌లు, పార్టీలు సిటీజనులకు అలవాటైన లైఫ్‌స్టైల్. రాత్రంతా పార్టీ చేసుకొని.. పొద్దున్నే ఈ తలనొప్పి ఏంట్రా దేవుడా.? అని తల పట్టుకొని రోజంతా కూర్చోవడం.. అది కాస్త సండే అయితే హాలీడేని హ్యాంగోవర్‌తో ఇంట్లోనే గడపటం బోరింగ్. ఇక మండే అయితే బాబోయ్.. ఆఫీస్‌కు వెళ్లడం కష్టమే.. వెళ్లినా ఒక పట్టాన వదలని హ్యాంగోవర్‌తో చిక్కులే. అయితే దీన్ని వదిలించుకోవడానికే సులువైన చిట్కాలు అందిస్తున్నారు నిపుణులు.
- ఓ మధు
మ్యూజిక్ మంత్రం
మ్యూజిక్ హ్యాంగోవర్ రిలీవర్‌గా పనిచేస్తుందని, ముఖ్యంగా నాజియా ఫీలింగ్‌ను తగ్గిస్తుందని ఇటీవల విదేశాల్లో చేసిన పరిశోధనల్లో తేలింది. హ్యాంగోవర్ తగ్గాలంటే నిద్రపోవాలి. హాయిగా నిద్రపోతూ రిలాక్స్ కావడానికి స్లో మ్యూజిక్ బెస్ట్ అంటున్నారు నిపుణులు. సంగీతానికి పిల్లలు, పాములు చలించటమే కాదు ఇప్పుడు హ్యాంగోవర్ కూడా చిక్కిపోవాల్సిందే అంటున్నాయి ఈ పరిశోధనలు. వికారం, నొప్పి నుంచి మనసును మళ్లించడానికి మ్యూజిక్ కన్నా మంచి మందు ఉండదట. మంచి సంగీతం పాజిటివ్ ఆలోచనలను పెంచి మంచి జ్ఞాపకాలను మేల్కొలిపి బాధను తగ్గించేస్తుందన్నది ఈ పరిశోధనల సారాంశం.
ధ్యానం ప్రధానం
మెడిటేషన్ కూడా హ్యాంగోవర్ తగ్గించేందుకు బాగా పనిచేస్తుందని రుజువైంది. కొన్ని నిమిషాల పాటు ధ్యానం చేయడం మంచి చిట్కా. అలాగే నచ్చిన వ్యాయామం కూడా మంచి ఫలితాన్నిస్తుందని పరిశోధనలో తేలింది.
హ్యాంగోవర్ తగ్గించుకోవడానికి చాలా మంది తరచూ పాటించే పద్ధతులు
కౌంటర్ పెయిన్ కిల్లర్
హ్యాంగోవర్ వల్ల కలిగే పెయిన్ తగ్గించుకోవడానికి ఈ టాబ్లెట్లు వాడతారు.
రీడిహైడ్రేటింగ్
తరచూ నీళ్లు సిప్ చేస్తూ ఉండటం. లేదా స్పోర్ట్స్ డ్రింక్స్, ఫ్రూట్ జ్యూస్, అల్లం టీ లాంటివి తీసుకుంటూ ఉండటం.
వివిధ దేశాల్లో హ్యాంగోవర్ తగ్గించుకోవడానికి పాటించే పద్ధతులు
రష్యా: స్టీమింగ్ ద్వారా తల భారాన్ని తగ్గించుకోవడం..
జపాన్: ప్లమ్ తినడం
ఇటలీ: కాఫీ సేవనం
చైనా: గ్రీన్ టీ తాగడం
యూఎస్: టమాటో జ్యూస్ తాగడం లేదా గుడ్లు తినడం
పోలాండ్: పికిల్ జ్యూస్ తాగడం
నెదర్లాండ్: బీర్ సేవనం