సచిన్‌ను ఎక్కడ ఉంచాలి!
రోహ్టక్: సచిన్ టెండూల్కర్ రంజీ మ్యాచ్ ఆడుతుండటంతో రోహ్టక్ జిల్లాలోని లాహ్లి స్టేడియంకు ఒక్కసారిగా కళ వచ్చింది. అయితే ఈ మ్యాచ్ ఆడేందుకు వచ్చే మాస్టర్‌కు ఎక్కడ వసతి ఏర్పాటు చేయాలో అర్ధం కాక హర్యానా క్రికెట్ సంఘం (హెచ్‌సీఏ) అధికారులు తలపట్టుకుంటున్నారు. క్రికెట్ దిగ్గజంతో పాటు సచిన్ పార్లమెంట్ సభ్యుడు కూడా. ఈ మైదానానికి సమీప పట్టణమైన రోహ్టక్లో ఫైవ్‌స్టార్ కాదు కదా కనీసం 2 స్టార్ హోటల్ కూడా లేదు. ఉన్న హోటల్లో కూడా ఎక్కడా 15కు మించి గదులు లేవు. ఇవి ముంబై జట్టు మొత్తం ఒక్కచోట ఉండటానికి సరిపోవు.
అందుబాటులో ఉన్న రెండు హర్యానా ప్రభుత్వ రిసార్ట్‌లలో కూడా ఇదే పరిస్థితి. చివరకు రివోలీ అనే హోటల్ కాస్త మెరుగ్గా కనిపిస్తున్నా భద్రత సమస్యగా మారింది. హర్యానాకు చెందిన ఎంపీ దీపేందర్ హుడాకు రోహ్టక్లో ఇల్లు ఉండటంతో ఆయన సచిన్‌ను అక్కడ ఉండాలని కోరుతున్నా...జట్టుకు దూరంగా విడిగా ఉండటానికి మాస్టర్ ఇష్టపడటం లేదు. కలెక్టర్, పోలీసులు సహకారంతో త్వరగానే దీనిని పరిష్కారం కనుక్కుంటామని మాత్రం హెచ్‌సీఏ ప్రస్తుతానికి చెప్పింది. గతంలో సెహ్వాగ్ సహా చాలా మంది లాహ్లిలో క్రికెట్ ఆడారు. కానీ సచినా...మజాకా!