స్ఫూర్తి చీకటి ఖండంలో వెలుగురేఖ!
రెండు దశాబ్దాల కిందట అతడు... చదువు మానేసిన మొద్దబ్బాయి. ఇంట్లో వాళ్ల పాలిట ఒక తలనొప్పి. ఎలా బతుకుతాడో అని భయపడేవారు అమ్మానాన్నా. హైస్కూల్ చదువు కూడా పూర్తి చేయలేకపోయిన అతడి బతుకు చీకటిమయం అవుతుందని అనుకునేవారంతా. కానీ అతడు చీకటి ఖండంలో ఒక వెలుగురేఖలా ప్రసరిస్తాడని ఎవరూ ఊహించలేదు.
ఎలక్ట్రానిక్స్ రంగంలో దాక్కొన్న సంపద అంతా ఇంతా కాదు. తోడుకొనే చేవ ఉండాలి కాని.. ఎంతైనా సంపాదించవచ్చన్న విషయాన్ని నిరూపించిన ఎంతోమంది ‘టెక్ ఎంటర్‌ప్రెన్యూర్స్’లో ఒకరు ఆశిష్ థక్కర్. అభివృద్ధి చెందుతున్న దేశాల్లో టెక్నాలజీ సంబంధిత వ్యాపారం చే సే వ్యక్తి తను కూడా ఆ దేశంతో పాటు అభివృద్ధి చెందవచ్చు, అభివృద్ధి బాటలో ఆ దేశం కన్నా వేగంగా నడవొచ్చు అని నిరూపిస్తున్నాడీయన.
ఆఫ్రికన్ దేశం ఉగాండాలో ఐదు వేల డాలర్ల సొమ్ముతో వ్యాపారాన్ని ప్రారంభించి మల్టీమిలియనీర్‌గా ఎదిగాడు మిస్టర్ థక్కర్. వాళ్ల తాతగారు 19వ శతాబ్దంలోనే ఉగాండాకు తిండి గింజలు ఎగుమతి చేసే వ్యాపారం చేసేవారట. తర్వాత థక్కర్ తండ్రి కూడా ఆ వారసత్వాన్ని కొనసాగించారు. ఆ వ్యాపారం కోసం ఉగాండాకు చేరింది వీరి కుటుంబం. అయితే ఆ దేశం నియంతృత్వంలోకి వెళ్లిపోవడంతో అక్కడి ఆసియన్లందరికీ కష్టాలు మొదలయ్యాయి. దీంతో 1973లో థక్కర్ కుటుంబం బ్రిటన్‌కు వెళ్లిపోయింది. చిన్నప్పట్నుంచీ ఇంట్లో అంతా వ్యాపారస్తుల్నే చూశాడేమో... థక్కర్‌కు చదువు మీద మనసు నిలవలేదు. హైస్కూల్ దశలోనే పుస్తకాలు వదిలేశాడు. పైగా మనోడిని ఉగాండా తెగ ఆకర్షించసాగింది. అప్పటికే కుటుంబం బ్రిటన్ వచ్చేసి పాతికేళ్లు గడిచిపోయాయి. అయినా కూడా అతడి మనసు అటే లాగింది. తాత, తండ్రులు వ్యాపారం చేసిన ఆ దేశంలో ఈ మూడో తరం థక్కర్ దశ కూడా తిరగాలని రాసి పెట్టి ఉందో ఏమో... ఐదు వేల డాలర్ల రుణం తీసుకొని 1995లో చీకటి ఖండంలో అడుగుపెట్టాడు పన్నెండేళ్ల ఆశిష్.
హార్డ్‌డ్రైవ్‌లు, ఫ్లాపీ డిస్క్‌లు, కాంపాక్ట్ డిస్క్, రామ్‌లను దుబాయ్ నుంచి తెప్పించుకొని ఉగాండాలో అమ్మడం మొదలు పెట్టాడు థక్కర్. అప్పటికది చెప్పుకోవడానికి పెద్ద బిజినెస్ ఏమీ కాదు. కానీ, 19ఏళ్లు గడిచే సరికి ఏటా రెండు వందల మిలియన్ డాలర్ల లాభాలను సాధించే స్థాయికి చేరింది అతడి వ్యాపారం. ఉగాండాతో మొదలై ఇప్పుడు మొత్తం 21 ఆఫ్రికా దేశాల్లోకి వేళ్లూనుకొంది ఇతడి సామ్రాజ్యం. ఇప్పుడతడి వయసు 31 సంవత్సరాలు! అతడి కంపెనీ విలువ 720 మిలియన్ డాలర్లు. అతడి వద్ద 8,500 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఆనంద్ మహీంద్రా వంటి వ్యాపారవేత్తలు కూడా థక్కర్‌ను ఒక గొప్ప వ్యాపారవేత్త అని అంటారు. అతడి సమర్థత అద్వితీయం అని అంటారు. ఆశిష్ థక్కర్ అంటే అతడు చీకటి ఖండంలో వ్యాపార మార్గాన్ని చూపిన వెలుగు రేఖ అని పొగడ్తలతో ముంచెత్తుతారు. థక్కర్ సాధించిన విజయాన్ని బట్టి చూస్తే ఈ ప్రశంసలు వందశాతం నిజమేనని చెప్పవచ్చు!