లారీ, ట్రాక్టర్ ఢీ: ఇద్దరి దుర్మరణం
కౌడిపల్లి, న్యూస్‌లైన్: గూడ్స్ లారీ, కలప ట్రాక్టర్ ఢీకొనడంతో ఇద్దరు దుర్మరణం చెందారు. ఈ సంఘటన కౌడిపల్లి మండలం నాగ్సాన్పల్లి గేట్ సమీపంలో బుధవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. ఎస్ఐ నాగార్జునగౌడ్ కథనం ప్రకారం.. వెల్దుర్తి మండలం అందుగులపల్లి తండాకు చెందిన మలోత్ హరిచంద్ కలప వ్యాపారం చేస్తుంటాడు. కౌడిపల్లి మండలం అంతారం చెరువుకొమ్మ తండాకు చెందిన నెనావత్ పూల్య అతని వద్ద కూలి పనికి వెళ్లాడు. ఓ ట్రాక్టర్‌ను అద్దెకు తీసుకుని బుధవారం తెల్లవారుజామున హైదరాబాద్ వైపు కలపను తరలిస్తున్నారు.
రాములు అనే వ్యక్తి ట్రాక్టర్‌ను నడిపిస్తుండగా హరిచంద్(30), పూల్య(45)లు ఇంజన్ మడ్గడ్పై చెరోవైపు కూర్చున్నారు. నాగ్సాన్పల్లిగేట్ సమీపంలోనికి రాగానే వెనుక నుంచి వచ్చిన గూడ్స్ లారీ ఢీకొంది. దీంతో ట్రాక్టర్ ఇంజన్ మడ్గ డ్‌పై కూర్చున్న హరిచంద్, పూల్యలు ఒక్కసారిగా కిందపడిపోయారు. హరిచంద్ తలపైనుంచి ట్రాక్టర్ టైరు వెల్లడంతో తల చితికిపోయి అక్కడికక్కడే మృతి చెందాడు. పూల్యపైనుంచి లారీ వెల్లడంతో తీవ్రంగా గాయపడ్డాడు. పెట్రోలింగ్ పోలీసులు అక్కడికి చేరుకుని పూల్యను 108 అంబులెన్స్‌లో నర్సాపూర్ ఆసుపత్రికి తరలించగా చికి త్స ప్రారంభించేలోపు మరణించాడు. హరిచంద్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నర్సాపూర్ ఆసుపత్రికి తరలిం చారు. ట్రాక్టర్ డ్రైవర్ బి.రాములు ప్రమా దం నుంచి సురక్షితంగా బయటపడ్డాడు. లారీ డ్రైవర్, క్లీనర్ పారిపోయారు.
హరిచంద్ కుటుంబీకుల రాస్తారోకో..
కుటుంబ సభ్యులు వచ్చేలోపు హరిచంద్ మృతదేహాన్ని పోలీసులు ఆసుపత్రికి తరలించారు. తాము వచ్చేలోపు ఎందుకు తరలించారంటూ అతని కుటుంబ సభ్యులు, బంధువులు నాగ్సాన్పల్లి వద్ద అరగంటపాటు రాస్తారోకో చేశారు. విషయం తెలుసుకున్న ఎస్ఐ అక్కడికి చే రుకుని వారిని సముదాయించారు. ట్రాక్ట ర్ డ్రైవర్ రాములు ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ తెలిపారు.
రెండు తండాల్లో విషాదం..
రోడ్డు ప్రమాదంలో హరిచంద్, పూల్యలు మృతి చెందడంతో వెల్దుర్తి మండలం అందుగులపల్లి తండా, కౌడిపల్లి మండలం అంతారం చెరువుకొమ్మ తండాలో విషాద ఛాయలు అలుముకున్నాయి. అందుగులపల్లి తండాకు చెందిన హరిచంద్‌కు తల్లిదండ్రులు గేని, రాములుతోపాటు భార్య బుజ్జి, ఇద్దరు కొడుకులున్నారు. ఇతనికి మూడు ఎకరాల వ్యవసాయ పొలం ఉంది. నెనావత్ పూల్య కూలి పనులు చేస్తుంటాడు. మొదటి భార్య కొమ్ని మరణించగా రెండో పెళ్లిచేసుకున్నాడు. పెద్ద భార్యకు ఓ కూతురు, చిన్న భార్యకు ఇద్దరు కొడుకులు, ఓ కూతురుంది. కాగా ఇద్దరు కూతుళ్ల పెళ్లిళ్లు అయ్యాయి. ఎకరం భూమి ఉండగా మొక్కజొన్న వేసినా అధిక వర్షాలతో చేతికి రాకుండా పోవడంతో నష్టపోయాడు. దీంతో కూలి పనులకు వెళ్తున్నాడు. పేదరికంతో కొట్టుమిట్టాడుతున్న ఈ రెండు కుటుంబాలు పెద్దదిక్కును కోల్పోయి మరిన్ని కష్టాల్లో కూరుకుపోయాయి. ఆర్థిక సహాయం అందించి బాధిత కుటుంబాలను ఆదుకోవాలని తండా వాసులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.