మూగబోయిన ‘హరికథ’
వర్గల్(గజ్వేల్) : హరికథను ఆధ్యాత్మిక ప్రచార సాధనంగా మలుచుకున్న బహుముఖ ప్రజ్ఞాశాలి, హరికథ విద్వాంసుడు దివంగత బ్రహ్మశ్రీ గుండు వెంకట్రామశర్మ(98)కు జిల్లాతో ఆత్మీయ అనుబంధం ఉంది. మర్కూక్ మండలం దామరకుంటలో గుండు రామచంద్రయ్య, రత్నమ్మ దంపతులకు 1924లో వెంకట్రామశర్మ జన్మించారు. ఆయనకు పిన్న వయస్సు నుంచే తల్లిదండ్రుల ద్వారా వంశపారంపర్యమైన ఆధ్యాత్మికత అలవడింది.
హరికథ పితామహులుగా పేరొందిన ఆదిభట్ల నారాయణదాసు వద్ద శిష్యరికం చేసి ప్రావీణ్యం సంపాదించారు. భారత–భాగవత గ్రంథాల్లోని శ్రీకృష్ణ తులాభారం, గయోపాఖ్యానం తదితర ఘట్టాలను అవపోసన పట్టిన మేధో సంపన్నుడు. సంగీతం, సాహిత్యం, అష్టాదశ పురాణాలు, వేదాలు, ఉపనిషత్తులు అవపోసనపట్టడంతో పాటు ఆకట్టుకునే గాత్రంతో ప్రజలను అలరించారు.
భారత, భాగవత ఇతిహాసాలను నృత్య, హావభావాలతో కళ్లకు కట్టేలా ఐదు దశాబ్దాల పాటు యాదగిరిగుట్ట, వేములవాడ, నాచారంగుట్ట, అల్వాల్ శివాలయం తదితర అనేక ప్రాంతాల్లో 1,500 పైగా హరికథా కాలక్షేపాలు చేశారు. మర్కూక్ భవనాందాశ్రమంతో ఏర్పడిన అనుబంధం, రజాకార్ల కాలంలో ఊరూరా తిరుగుతూ తన కళ ద్వారా ప్రజల్లో ఆధ్యాత్మిక భావనలు విస్తరింపజేశారు.
హరికథకు విరామం
హరికథలతో ఆధ్యాత్మికతలు పంచిన బ్రహ్మశ్రీ గుండు వెంకట్రామశర్మ సోమవారం హైదరాబాద్‌లోని ఘాస్‌మండీలో అనారోగ్యంతో మృతి చెందారు. ఈ విషయం తెలిసిన జిల్లాలో విషాదం నెలకొంది. ఆయన మిత్రులు ఎందరో శర్మతో వారికున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. వెంకట్రామశర్మ సతీమణి జయమ్మ కొంతకాలం క్రితం మృతి చెందారు. ఆయనకు కుమారుడు రమేశ్‌శర్మ, కుమార్తెలు లలిత, జానకి ఉన్నారు.
ఆయన సోదరుడు రఘురామశర్మ నాలుగు దశాబ్దాల పాటు దామరకుంట సర్పంచ్‌గా కొనసాగారు. హైదరాబాద్‌లో స్థిరపడిన బ్రహ్మశ్రీ వెంకట్రామశర్మ మృతిపై మర్కూక్ ఆశ్రమ వర్గాలు, గజ్వేల్ నియోజక వర్గ బ్రాహ్మణ సంఘ నాయకులు ఆయన కుటుంబానికి ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు.