ఎనిమిది మంది రైతుల బలవన్మరణం
సాక్షి నెట్వర్క్: అప్పుల బాధతో సోమవారం ఎనిమిది మంది రైతులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. నల్లగొండ జిల్లా దామరచర్ల మండలం గణేశ్‌పాడ్‌కు చెందిన కొర్ర భాను (40) తనకున్న రెండు ఎకరాల్లో సాగు చేశాడు. ప్రైవేట్‌గా రూ.3 లక్షల వరకు ఉన్న అప్పుల వడ్డీ పెరిగిపోతుండడంతో ఆదివారం రాత్రి క్రిమిసంహారక మందు తాగాడు. కనగల్ మండలం జి.యడవల్లికి చెందిన గడ్డం హరిబాబు(38) సాగుకు చేసిన అప్పులు సుమారు. రూ.8 లక్షలు ఎలా తీరుతాయోనని దిగులు చెంది పురుగుల మందు తాగాడు.
చందంపేట మండలం బొల్లారం గ్రామానికి చెందిన నేనావత్ బీల్యా(48) గత ఏడాది కూతురు పెళ్లికి చేసిన అప్పుతో పాటు వ్యవసాయానికి తెచ్చిన అప్పులు రూ.నాలుగున్నర లక్షలకు చేరాయి. అప్పులు తీరే మార్గం కానరాక చెట్టుకు ఉరివేసుకున్నాడు. మహబూబ్‌నగర్ జిల్లా పెబ్బేరు మండలవ తాటిపాములలో శేఖర్ రెడ్డి(52) తనకున్న ఆరుఎకరాల్లో వేరుశనగ, పత్తి పంటలను సాగు, కుటుంబ అవసరాల కోసం సుమారు రూ.10 లక్షల దాకా అప్పుచేశాడు.
అప్పులు ఎలా తీర్చాలో తెలియక దిగులు తో ఉరేసుకున్నాడు. వరంగల్ జిల్లా భూపాలపల్లి కాశీంపల్లికి చెందిన తూటి తిరుపతి(32), మొగుళ్లపల్లి మండల కేంద్రానికి చెందిన ఎల్కటూరి శంకర్(50), లింగాలఘణపురం మండలం చీటూరులో ఐల కుమార్(30) ఆర్థిక ఇబ్బందులు తాళలేక క్రిమిసంహారక మందు తాగారు. నిజామాబాద్ జిల్లా సదాశివనగర్ మండలం తిర్మన్‌పల్లికి చెందిన రైతు శివశెట్టి భూమప్న(47) రూ.4 లక్షల అప్పు తీర్చలేక పురుగుల మందు తాగాడు.