మంత్రి వాహనంపై కూలీల దాడి
గుంటూరు: హరిహరమహల్ సెంటర్లో శనివారం రాత్రి ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఘటనాస్థలికి వచ్చిన మంత్రి రావెల కిషోర్ బాబు వాహనంపై బాధిత కూలీల బందువులు ఆగ్రహావేశాలతో దాడికి దిగారు. దీంతో చేసేదేమీలేక మంత్రి అక్కడి నుంచి వెనుదిరిగారు.
హరిహరమహాల్ సెంటర్లో భవన నిర్మాణ పనుల్లో ప్రమాదం చోటుచేసుకున్న విషయం తెలిసిందే. భవన నిర్మాణ పనులు జరుగుతుండగా మట్టిపెళ్లలు ఒక్కసారిగా విరిగిపడ్డాయి. శనివారం రాత్రి జరిగిన ఈ ప్రమాదంలో కూలీలు 8 మంది వరకు చిక్కుకున్నట్టు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. భవన నిర్మాణ పనుల్లో భాగంగా 15 మంది కూలీలతో 30 అడుగుల లోతు తవ్వుతుండగా మట్టిపెళ్లలు విరిగిపడ్డాయి. అయితే ఇప్పటివరకూ శిథిలాల నుంచి ఒక మృతదేహాన్ని మాత్రమే వెలికితీయగా, శిథిలాల కింద చిక్కుకున్న వారంతా సజీవంగా ఉన్నారా లేదా అనే దానిపై ఆందోళన నెలకొంది.