అదే పరమధర్మం!
శ్రావస్తి సమీపంలోని అడవిలో హారీతికి అనే నరమాసం భక్షిణి ఉండేది. ఆమె అడవి పొలిమేరల్లో ఉన్న గ్రామాల మీద పడి, దొరికిన చిన్నపిల్లల్ని అపహరించేది. గ్రామాల్లోని తల్లుల ఎంతగానో తల్లడిల్లి, ఈ సమస్యను తీర్చగల నేర్పరి బుద్ధుడేనని విని, ఆయన దగ్గరకు వెళ్లి తమ దుఃఖాన్ని వెళ్లగక్కారు.
బుద్ధుడు వారు చెప్పినదంతా మౌనంగా విన్నాడు. వెంటనే లేచి హారీతికి నివసించే కొండగుహ దగ్గరకు వెళ్లాడు. అప్పుడు అక్కడ హారీతికి లేదు. ఆమె యాభైమంది సంతానం మాత్రం అక్కడుంది. వారిలోంచి ఒక చిన్న పిల్లాణ్ణి తీసుకుని తన ఆరామానికి వచ్చేశాడు బుద్ధుడు.
కొంతసేపటికి హారీతికి వచ్చి చూస్తే తన బిడ్డల్లో ‘ప్రియంకరుడు’ అనే వాడు కన్పించలేదు. విషయం తెలుసుకుని శ్రావస్తి కేసి ఏడుస్తూ, గుండెలు బాదుకుని రోదిస్తూ పరుగులు తీస్తూ బయలుదేరింది.
దారి పొడవునా ‘ఓ! నా ప్రియకుమారా! ప్రియంకరుడా! ఎక్కడున్నావు తండ్రీ! ఎలా ఉన్నావు తండ్రీ!!’’అంటూ పెద్దగా ఆర్తనాదాలు చేస్తూ పోయి, చివరికి బుద్ధుని ఆరామం చేరి, ‘‘ఓ మునీ! నా బిడ్డ ఏమి? వాణ్ణి ఏం చేశావు? చంపుకు తిన్నావా? నీ పాదాలు పట్టుకుంటా... నా బిడ్డను నాకు ఇవ్వు..’’ అంటూ కన్నీరు మున్నీరైంది.
అప్పుడు బుద్ధుడు ‘‘తల్లీ! హారీతికీ! కలవరపడకు. ఏడ్వకు. నీ బిడ్డ నా దగ్గరే క్షేమంగా ఉన్నాడు’’అన్నాడు దయాదృక్కులతో. ఆ మాటలు విన్న హారీతికి ముఖంలో ఆనందం, చిరునవ్వులు వెలిగిపోయాయి.
‘‘చూశావా హారీతికీ!! నీకు ఎందరో బిడ్డలున్నారు. వారిలో ఒక్కడు పోగానే ఇంతగా రోదించావు. అలాగే గ్రామాల మీదపడి నీవు అపహరించే తల్లులు కూడా నీకంటే ఎంతో ఎక్కువగా దుఃఖపడతారు. ఎందుకంటే వారికి ఇద్దరో ముగ్గురో పిల్లలు గదా!’’అన్నాడు. ఆమె మౌనంగా తలూపింది.
‘‘తల్లీ! దుఃఖం ఎవరికైనా ఒకటే. ఇతరులు ఏమి చేస్తే మనం దుఃఖపడతామో ఆ పని మనం ఇతరులకు చేయకూడదు. అంతకు మించిన ధర్మం మరొకటి లేదు. ఇకనుండి ఇది తెలుసుకుని జీవించు’’అని ప్రబోధించాడు. ఆనాటి నుంచి హారీతికి బిడ్డల్ని అపహరించడం మానుకుంది.
- డా. బొర్రా గోవర్ధన్