మంత్రి పీఎస్ ఇంటిపై లోకాయుక్త దాడి
కీలక పత్రాలు స్వాధీనం
శివమొగ్గ, న్యూస్‌లైన్ : నగరంలోని ఓ గ్రూప్ డీ (క్లర్కు క్యాడర్) ఉద్యోగి నివాసంపై బుధవారం లోకాయుక్త పోలీసులు దాడులు చేసి ఆస్తులకు సంబంధించిన కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. వివరాలు... నగరంలో హొనమనే లేఔట్లో నివాసముంటున్న హర్ష మహిళా శిశు సంక్షేమ శాఖలో గ్రూప్ డీ ఉద్యోగి. గత బీజేపీ సర్కార్‌లో ఎక్సైజ్ మంత్రి రేణుకచార్య వద్ద పీఎస్ (వ్యక్తిగత కార్యదర్శి)గా పనిచేసిన హర్ష, ప్రస్తుతం రాష్ట్ర మంత్రిగా ఉన్న అభయచంద్రజైన్ వద్ద పర్సనల్ సెక్రటరీగా ఉన్నారు.
ఉదయం లోకాయుక్త ఎస్పీ.లింగారెడ్డి నేతృత్వంలో శివమొగ్గ లోకాయుక్త డీవైఎస్పీ నాగరాజ్, సీఐ పురుషోత్తమ్ సిబ్బంది హర్ష ఇంటిలో పలు కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. మధ్యాహ్నం వరకు సోదాలు చేశారు. అయితే స్థిర, చరాస్తులకు సంబంధించి అధికారికంగా ఎలాంటి సమాచారం అందించలేదు.
దాడుల సమయంలో శివమొగ్గ నగరంలోని ఎల్బీఎస్, జీహెచ్.పటేల్ లేఔట్లో ఖాళీ స్థలాలు, హుణసేహళ్లి గ్రామంలో రెండన్నర ఎకరా భూమి, రూ.18 వేల నగదుతో పాటు సుమారు 340 గ్రాములు బంగారం, ఒకటిన్నర కిలో వెండి, వివిధ బ్యాంకుల్లో ఆర్థిక లావాదేవీలకు చెందిన పత్రాలు, రెండు ైబె క్లు, ఒక కారు, బ్యాంకు పాస్‌బుక్కులు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం.