అందుబాటు గృహాలకే డిమాండ్
కానీ, సరఫరా మాత్రం ఆశించిన స్థాయిలో లేదు
• మార్చికల్లా మంచిర్యాలలో బ్రాంచ్ ప్రారంభం
• మా రుణాల్లో ఏపీ–తెలంగాణ వాటా 22 శాతం
• వచ్చే ఏడాదికల్లా 30 శాతానికి చేరుస్తాం
• డీహెచ్ఎఫ్ఎల్ సీఈఓ హర్షిల్ మెహతా
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ‘‘దేశంలో రోజురోజుకూ అందుబాటు ధరల్లో ఉండే గృహాలకు డిమాండ్ పెరుగుతోంది. 87 శాతం ప్రజలు ఈ గృహాల కొనుగోళ్లకే మొగ్గు చూపుతున్నారు. కానీ, సరఫరా మాత్రం ఆశించినంత స్థాయిలో లేదు. అందుబాటు గృహాల డిమాండ్–సరఫరాల మధ్య వ్యత్యాసం 7 కోట్లుగా అంచనా వేస్తున్నాం’’ అని డీహెచ్ఎఫ్ఎల్ సీఈఓ హర్షిల్ మెహతా వివరించారు. సులభంగా బ్యాంకు రుణాలు మంజూరవుతుండటం, నగరాలకు ఎక్కువ మంది వస్తుండటం వంటి కారణాల వల్ల ఎగువ మధ్యతరగతి, లగ్జరీ గృహాల నిర్మాణాలే ఎక్కువగా నిర్మిస్తున్నారని, దీంతో అందుబాటు ఇళ్లకు కొరత ఏర్పడుతోందని ఆయన వివరించారు.
బుధవారమిక్కడ విలేకరులతో ఆయన మాట్లాడారు. దేశంలో మొత్తం గృహ రుణాల విపణి సుమారు రూ.1.20 లక్షల కోట్లుగా ఉంటే.. ఇందులో సంఘటిత పరిశ్రమ వాటా 20–30 శాతంగా ఉందని ఆయన తెలియజేశారు. ఏటా పరిశ్రమ 15–17 శాతం వృద్ధి రేటును నమోదు చేస్తోందన్నారు. ‘‘గడిచిన రెండు నెలలుగా బ్యాంకుల్లో పేరుకుపోయిన డబ్బు క్రమంగా ఇప్పుడు మార్కెట్లోకి వస్తోంది. అందుకే ఆర్బీఐ కూడా విత్డ్రా పరిమితిని క్రమంగా పెంచుతోంది. ఇలాగే వచ్చే రెండు మూడు నెలల్లో గృహ రుణ వడ్డీ రేట్లను కూడా తగ్గించే అవకాశముంది’’ అని మెహతా అంచనా వేశారు. ఈ తగ్గింపు పావుశాతం ఉండవచ్చని చెప్పారాయన. గృహ రుణాల్లో నిరర్ధక ఆస్తులు (ఎన్పీఏ) చాలా తక్కువగా ఉంటాయంటూ... డీహెచ్ఎఫ్ఎల్కు 0.95 శాతం ఎన్పీఏలున్నాయని, విలువ పరంగా చూస్తే గతేడాది డిసెంబర్ 31 నాటికి ఇవి రూ.65.6 కోట్లు అని తెలియజేశారు.
30 శాతం వృద్ధి లక్ష్యం..
దేశంలోని మొత్తం గృహ రుణాల విపణిలో డీహెచ్ఎఫ్ఎల్ వాటా 12–14 శాతం వరకూ ఉన్నట్లు మెహతా చెప్పారు. ‘‘గతేడాది డిసెంబర్ 31 నాటికి రూ.6,525 కోట్ల గృహ రుణాలను పంపిణీ చేశాం. ఇందులో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండు రాష్ట్రాల్లో రూ.1,296 కోట్లు, హైదరాబాద్లో రూ.221 కోట్ల రుణాలను పంపిణీ చేశాం. మొత్తం వ్యాపారంలో 22 శాతంగా ఉన్న ఏపీ, తెలంగాణ వాటాను వచ్చే 9 నెలల్లో 30 శాతానికి చేర్చాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. ప్రస్తుతం దేశవ్యాప్తంగా డీహెచ్ఎఫ్ఎల్కు 350 బ్రాంచీలున్నాయి. తెలంగాణలో 30 ప్రాంతాల్లో 14 బ్రాంచీలు, ఏపీలో 70 ప్రాంతాల్లో 18 బ్రాంచీలున్నాయి. మార్చి నాటికి మంచిర్యాలలో బ్రాంచీని ప్రారంభించనున్నాం. రెండు రాష్ట్రాల్లో కలిపి సుమారు 50 వేల కుటుంబాలకు రుణాలందించాం’’ అని వివరించారాయన.