తెల్ల వెంట్రుకల గుట్టు తెల్సింది!
న్యూఢిల్లీ : నెత్తిన నల్లగా నిగనిగలాడాల్సిన వెంట్రుకలు ఎందుకు తెల్లబడతాయి? ఇంతవరకు ఏ శాస్త్రవేత్త ఇదీ కారణమంటూ నిగ్గు తేల్చలేకపోయారు. వయస్సు మీరితే వెంట్రుకలు తెల్లపడతాయని కొందరు, బలహీనత వల్ల తెల్లబడతాయని కొందరు, విటమిన్ల లోపం వల్ల వస్తాయని మరికొందరు చెబుతూ వచ్చారు. వయస్సులో ఉన్న వారికి వెంట్రుకలు ఎందుకు తెల్లబడుతున్నాయి, విటమిన్లు పుష్టిగా ఉన్నా ఎందుకు తెల్ల వెంట్రుకలు వస్తున్నాయంటూ అడుగుతున్న ప్రశ్నలకు ఇంతకాలం సరైన జవాబు దొరకలేదు.
హార్వర్డ్ యూనివర్శిటీ నిపుణులు ఎలుకలపై జరిపిన తాజా అధ్యయనంలో అసలు కారణం తెల్సింది. మానసిక ఒత్తిడి కారణంగానే వెంట్రుకలు తెల్లబడతాయని తేలింది. మానసిక ఒత్తిడి వల్ల ‘నోర్పైన్ప్రైన్ లేదా నోరాడ్రెనాలైన్ లేదా నోరాడ్రెనాలిన్గా పిలిచే హార్మోన్ శరీరం నుంచి విడుదలై అది రక్తంలో కలుస్తుంది. దాని వల్ల గుండె కొట్టుకునే వేగం కూడా పెరుగుతుంది. రక్తంలో కలిసిన ఈ హార్మోన్ వెంట్రుకలను ఎప్పుడు నల్లగా ఉంచే ‘మెలానోకైట్’ మూల కణాలను తెబ్బతీస్తుంది. అందుకని వెంట్రుకలు తెల్లబడుతాయి. సాధారణంగా తెల్ల వెంట్రుకలు 30వ ఏట మొదలై, 50వ ఏడు వచ్చే సరికి సగం జుట్టు తెల్లబడుతుంది. ఇంకా అంతకంటే ముందు టీనేజ్లోనే వెంట్రుకలు తెల్లబడినట్లయితే అది వంశపారంపర్యంగా వచ్చే జన్యువులు కారణం.
ఒత్తిడి నుంచి శరీర భాగాలను రక్షించేందుకే నోరాడ్రెనాలిన్ హార్మోన్ విడుదలవుతుంది. ఎలుకల్లో నోరాడ్రెనాలిన్ హార్మోన్ను పంపించిన 24 గంటల్లోనే వాటి వెంట్రుకలు 50 శాతం తెల్లబడ్డాయని అధ్యయన బృందం పేర్కొంది. మానసిక ఒత్తిడి వల్ల ఒక్క వెంట్రుకలే కాకుండా శరీరంలోని పలు భాగాలపై ప్రభావం చూపుతుందని, వేటి వేటిపై ప్రభావం చూపుతుందో ఇంకా అధ్యయనం చేయాల్సి ఉందని తెలిపింది. ఒక్కసారి తెల్లబడిన వెంట్రుకలు ఎప్పటికీ నల్లగా మారే ప్రసక్తే లేదని, మానసిక ఒత్తిడి తట్టుకునేందుకు ఎప్పుడు మానసికంగా అప్రమత్తంగా ఉండాలని వైద్య బృందం సూచించింది. వారి అధ్యయన వివరాలను ‘నేచర్’ తాజా సంచికలో ప్రచురించారు.