హలో.. నేను ముఖ్యమంత్రి మాట్లాడుతున్నా
గుర్గావ్: హరియాణా ముఖ్యమంత్రి మనోహర్‌లాల్ ఖట్టర్నంటూ ఫోన్ చేసి మోసం చేసేందుకు ప్రయత్నించిన ఓ యువకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఢిల్లీకి చెందిన 29 ఏళ్ల యువకుడు గుర్గావ్లోని ప్రముఖ హోటల్లో ఉద్యోగం కోసం దరఖాస్తు చేసుకున్నాడు. ముఖ్యమంత్రి సిఫారసు చేస్తున్నట్టుగా రెజ్యూమ్‌పై తప్పుగా పేర్కొన్నాడు. అంతేగాక రెండువారాల క్రితం ఆ యువకుడు సీఎం పేరుతో హోటల్ మేనేజ్మెంట్తో ఫోన్లో మాట్లాడి ఉద్యోగం కోసం దరఖాస్తు వ్యక్తిని (అతణ్నే) తీసుకోవాలని చెప్పాడు.
అనుమానం రావడంతో హోటల్ సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేశారు. గుర్గావ్ పోలీసులు నిందితుడిని ఢిల్లీకి చెందిన అమిత్ కుమార్‌గా గుర్తించి అరెస్ట్ చేవారు. గురువారం కోర్టులో అమిత్ కుమార్‌ను హాజరపరచగా, ఒకరోజు పోలీస్ కస్టడీకి అప్పగించారు. అమిత్ హోటల్ మేనేజ్మెంట్లో కోర్సు చేశాడని, నగరంలోని క్రౌన్ ప్లాజాలో ఉద్యోగం కోసం దరఖాస్తు చేశాడని, ఫోన్లో ముఖ్యమంత్రిగా మాట్లాడి మోసం చేసేందుకు ప్రయత్నించాడని పోలీసులు తెలిపారు.