పాన్వాలాకు 132 కోట్ల కరెంటుబిల్లు
కిళ్లీకొట్టు పెట్టుకుని బతికే ఓ బడుగుజీవికి దీపావళి రోజు పెద్ద షాక్ తగిలింది. అతడికి ఏకంగా 132 కోట్ల రూపాయల కరెంటు బిల్లు వచ్చింది. ఈ సంఘటన హర్యానాలోని సోనిపట్ జిల్లా గొహానా పట్టణంలో జరిగింది. అక్టోబర్ నెలకు గాను రాజేష్ అనే ఆ చిరువ్యాపారికి 132.29 కోట్ల రూపాయల కరెంటు బిల్లు వచ్చింది. అది చూసి తాను షాకయ్యానని, ముందు కేవలం అంకెల్లో ఏదో రెండు మూడు సున్నాలు ఎక్కువ వచ్చాయనుకుంటే, అక్షరాల్లోకూడా అలాగే ఉందని రాజేష్ చెప్పాడు. చిన్న దుకాణం అద్దెకు తీసుకుని ఓ లైటు, ఓ ఫ్యాను పెట్టుకుని ఉంటున్నానని, బాగా ఎక్కువ వస్తే వెయ్యి రూపాయలకు మించి బిల్లు ఎప్పుడూ రాలేదని అన్నాడు.
ఉత్తర హర్యానా బిజిలీ వితరణ్ నిగమ్ ఈ బిల్లు జారీచేసింది. గతంలో కూడా హర్యానాలో ఇలా భారీ స్థాయిలో బిల్లులు వచ్చాయి. 2007 ఏప్రిల్లో మురారీలాల్ అనే మరో వ్యక్తికి ఏకంగా 234 కోట్ల రూపాయల బిల్లు కూడా వచ్చింది. ఈ ఘనత కూడా హర్యానా విద్యుత్ బోర్డుదే.