హ్యాట్రిక్ ‘లడ్డూ’
మండపేట, న్యూస్‌లైన్ : మహాలడ్డూల తయారీలో వరుసగా మూడుసార్లు గిన్నిస్ రికార్డులు సాధించి హ్యాట్రిక్ కొట్టింది తాపేశ్వరంలోని భక్తాంజనే స్వీట్స్ సంస్థ. వినాయక చవితి వేడుకల సందర్భంగా వేలాది కిలోల మహాలడ్డూలను వీరు తయారు చేస్తున్నారు. 1942లో సలాది సత్యనారాయణ నెలకొల్పిన ఈ సంస్థను ప్రస్తుతం ఆయన తనయుడు సలాది వెంకటేశ్వరరావు (శ్రీనుబాబు) నిర్వహిస్తున్నారు. తొలిసారిగా 2011లో విశాఖపట్నానికి చెందిన సువర్ణభూమి సంస్థ ఆర్డర్ మేరకు సంస్థ అధినేత శ్రీనుబాబు 5,570 కేజీల లడ్డూ తయారు చేయించారు. దీనిద్వారా తాపేశ్వరం పేరును తొలిసారిగా గిన్నిస్ పుటల్లోకి ఎక్కింది. అలాగే ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్సు, స్టేట్ బుక్ ఆఫ్ రికార్డ్సులోను చోటు దక్కించుకుంది. తర్వాత 2012 వినాయక చవితి వేడుకల కోసం రాజమండ్రిలోని రాజమహేంద్రి గణేష్ ఉత్సవ కమిటీ ఆర్డరుపై తయారుచేసిన 6,599.29 కేజీల లడ్డూ పాత రికార్డును తిరగరాసి కొత్త రికార్డును నమోదు చేసింది.
మళ్లీ రాజమహేంద్రి గణేష్ ఉత్సవ కమిటీ కోసం 2013లో తయారుచేసిన 7,132.87 కేజీల మహాలడ్డూ పాత రికార్డులన్నింటినీ తిరగరాసి గిన్నిస్ రికార్డును నమోదుచేసుకుంది. అందుకు సంబంధించిన సర్టిఫికెట్ శనివారం సంస్థ అధినేత శ్రీనుబాబుకు అందింది. మూడు పర్యాయాలు లడ్డూ తయారీని ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్సు సంస్థ ప్రతినిధులు దగ్గర ఉండి పర్యవేక్షించినట్టు శ్రీనుబాబు తెలిపారు. గణేష్ మహాలడ్డూల తయారీ ద్వారా గత మూడేళ్లలోను గిన్నిస్ రికార్డులతో పాటు ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్సు, తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్సు, ఎవరెస్ట్ బుక్ ఆఫ్ రికార్డ్సు, వ రల్డ్ అమేజింగ్ బుక్ ఆఫ్ రికార్డ్సు, నిడదవోలుకు చెందిన పొట్టి శ్రీరాములు సేవా సమితి వారి ఏకవీర అవార్డు, సిరిమువ్వ ఎడ్యుకేషనల్ సొసైటీ వారి విశ్వజననీ అవార్డు తదితర మొత్తం 18 అవార్డులను శ్రీభక్తాంజనేయ స్వీట్స్ సంస్థ సాధించి రికార్డు సృష్టించింది.
ఎంతో ఆనందంగా ఉంది
వరుసగా మూడు సార్లు గిన్నిస్ రికార్డులను సాధించడం ఎంతో ఆనందంగా ఉంది. మా సంస్థ సిబ్బంది సహకారంతోనే ఈ రికార్డులను సాధించగలిగాం. భవిష్యత్తులో మరిన్ని రికార్డులు సాధిస్తాం.
- సలాది శ్రీనుబాబు,
భక్తాంజనేయ స్వీట్స్ సంస్థ అధినేత, తాపేశ్వరం