Hatchback car
-
టయోటాలో అత్యంత సరసమైన ధరలో కార్..! ధర ఎంతంటే..!
ప్రముఖ జపనీస్ ఆటోమొబైల్ దిగ్గజం టయోటా దేశీయ మార్కెట్లోకి 2022 టయోటా గ్లాంజాను లాంచ్ చేసింది. భారత్‌లోని టయోటా కార్లలో 2022 టయోటా గ్లాంజా అత్యంత సరసమైన ధరలో కొనుగోలుదారులకు అందుబాటులో ఉండనుందని కంపెనీ ప్రకటించింది. ఇంజన్ విషయానికి వస్తే..! 2022 టయోటా గ్లాంజా 1.2 లీటర్, ఫోర్ సిలిండర్ డ్యుయల్‌జెట్ కే12ఎన్ పెట్రోల్ ఇంజిన్ తో 90hp పవర్ తో 113 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేయనుంది. ఇందులో 5 స్పీడ్ ఆటో, మ్యాన్యువల్ ట్రాన్స్మిషన్ వేరింయట్లలో అందుబాటులో ఉండనుంది. డిజైన్‌లో స్టైలిష్ లుక్‌తో..! 2022 టయోటా గ్లాంజా కార్ ముందుబాగం స్టైలిష్ లుక్ వచ్చేలా కంపెనీ డిజైన్ చేసింది. బంపర్, ముందు గ్రిల్, హెడ్ లైట్, ఎల్ఈడీ లైట్స్ గ్రాఫిక్స్ డిజైన్ లో గ్లాంజా కొత్తదనాన్ని కలిగి ఉండనుంది. వేరువేరు మోడళ్లలో లభించే ఫీచర్లు మారనున్నట్లు కంపెనీ వెల్లడించింది. 360-డిగ్రీ కెమెరా, ఆండ్రాయిడ్ ఆటో యాపిల్ కార్ప్లే సపోర్ట్‌తో కూడిన 9.0-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, ‘టయోటా ఐ-కనెక్ట్’ కనెక్ట్ చేయబడిన కార్ టెక్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, టిల్ట్ , టెలిస్కోపిక్ అడ్జస్ట్మెంట్తో కూడిన స్టీరింగ్, 6 ఎయిర్‌బ్యాగ్స్‌తో రానున్నాయి. బాలెనో, ఆల్ట్రోజ్ వంటి కార్లకు పోటీగా..! 2022 టయోటా గ్లాంజా కొద్ది వారాల క్రితం మారుతి సుజుకి లాంచ్ చేసిన బాలెనో, టాటా ఆల్ట్రోజ్, హ్యుందాయ్ ఐ20, ఫోక్స్‌వేగన్ పోలో, హోండా జాజ్ కార్లకు పోటీగా నిలుస్తోందని టయోటా కిర్లోస్కర్ మోటార్ ఒక ప్రకటనలో వెల్లడించింది. ధర ఏంతంటే..? టయోటా గ్లాంజా మొత్తంగా నాలుగు ట్రిమ్ లేవల్స్లో రానుంది. గ్లాంజా ధరలు రూ. 6.39 లక్షల నుంచి ప్రారంభంకానున్నాయి. కంపెనీకి చెందిన డీలర్‌షిప్‌లు, వెబ్సైట్ ద్వారా కేవలం రూ.11,000తో ప్రి బుకింగ్స్‌ను టయోటా గత వారం ప్రారంభించింది. చదవండి: మైలేజ్‌లో రారాజు..మారుతి సుజుకీ రికార్డుల హోరు..! 10 లక్షలకుపైగా.. -
మార్కెట్లోకి హ్యుందాయ్ ‘ఎలైట్ ఐ 20’
సాక్షి, న్యూఢిల్లీ: హ్యుందాయ్ కంపెనీ ఐ20 మోడల్లో అంతా కొత్తదైన ఎలైట్ ఐ20 కారును సోమవారం మార్కెట్లోకి తెచ్చింది. పెట్రోల్, డీజిల్ వేరి యంట్లలో ఈ కారును అందిస్తున్నామని హ్యుందాయ్ మోటార్స్ ఇండియా ఎండీ, బీఎస్ సియో చెప్పారు. పెట్రోల్ వేరియంట్ ధరలు రూ.4.9 లక్షలు నుంచి రూ.6.46 లక్షల రేంజ్లో, డీజిల్ వేరియంట్ ధరలు రూ.6.09 లక్షల నుంచి రూ.7.67 లక్షల రేంజ్లో (ధరలు ఎక్స్ షోరూమ్, ఢిల్లీ) ఉన్నాయని వివరించారు. ప్రపంచవ్యాప్తంగా ఈ కారును మొదటిసారి భారత్‌లోనే విడుదల చేశామని చెప్పారు. ఐ20 మోడల్‌ను 2008, డిసెం బర్లో మార్కెట్లోకి తెచ్చామని ఇప్పటిదాకా 7.34 లక్షలు విక్రయించామని పేర్కొన్నారు. ఈ కొత్త మోడల్లో ఎరా, మాగ్నా, స్పోట్జ్, స్పోట్జ్ (ఓ), ఆస్టా-5 వేరియంట్లు అందుబాటులో ఉన్నాయి. ఈ కారు మారుతీ సుజుకి స్విఫ్ట్, ఫోక్స్‌వ్యాగన్ పోలో కార్లకు గట్టి పోటీనిస్తుందని పరిశ్రమ వర్గాలంటున్నాయి. నెలకు 6000కు ఐ20 అమ్మకాలు గత ఏడాది మొత్తం 3.8 లక్షల కార్లను విక్రయించామని, ఈ ఏడాది 4.10 లక్షల కార్లను విక్రయించాలనేది లక్ష్యమని కంపెనీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ (సేల్స్ అండ్ మార్కెటింగ్) రాకేష్ శ్రీవాస్తవ పేర్కొన్నారు. ఐ20 కార్లు నెలకు 3,800 చొప్పున అమ్ముడవుతున్నాయని, ఈ కొత్త వెర్షన్‌తో ఈ సంఖ్య 6,000కు చేరగలదని చెప్పారు. -
ఇంపాలా ఇప్పుడిలా
యాభయ్యేళ్ల కిందట పడవలాంటి ఇంపాలా కార్లు నగర వీధుల్లో గొప్ప దర్జాగా ఊరేగేవి. ఇంపాలా కారులో నవ వధూవరుల ఊరేగింపు అప్పటి తరానికి ఒక కనువిందైన దృశ్యం. అంబారీ ఏనుగు సవారీ సైతం దాని ముందు బలాదూరే! కాలంలో వచ్చిన మార్పులతో నగర వీధులు ఇరుకుగా మారాయి. ఇరుకు వీధుల్లో తిరిగేందుకు అనువైన ఇరుకిరుకు హ్యాచ్‌బ్యాక్ కార్ల జోరు పెరగడంతో ఇంపాలా కారు మూలనపడింది. ఒకప్పుడు ఘన వైభవాన్ని అనుభవించిన ‘ఇంపాలా’ ప్రస్తుత స్థితిపై ఓ కథనం... ఇంపాలా సవారీ అప్పట్లో స్టేటస్ సింబల్. తొలినాళ్లలో ఇవి స్టేట్‌బ్యాంకు ఎదుట పార్క్ చేసి ఉండేవి. పెళ్లిళ్లు, ఇతర వేడుకల్లో ఊరేగింపుల కోసం అద్దెకిచ్చేందుకు కొందరు వీటిని మహారాష్ట్ర, కర్ణాటక నుంచి నగరానికి తీసుకువచ్చారు. పూలతో అలంకరించిన ఈ కార్లలో నూతన వధూవరులు ఊరేగుతుంటే జనం అబ్బురంగా తిలకించేవారు. నగరానికి చెందిన ప్రముఖ నేతలు ముఖేశ్‌గౌడ్, దానం నాగేందర్, మల్లు రవి వంటి వారు తమ పెళ్లిళ్ల సమయంలో ఈ కార్లలోనే ఊరేగారు. ఎల్బీ స్టేడియం నుంచి అబిడ్స్ వైపు వెళుతుంటే, బాంబే కేఫ్ పక్కన ఆనాటి ఇంపాలా కార్లు బారులు తీరి ఇప్పటికీ కనిపిస్తాయి. అయితే, అప్పటి కళ... ఇప్పుడు కనిపించదు. అప్పట్లో గిరాకీ బాగుండటంతో వీటి ఓనర్లు బాగానే బతికేవారు. డ్రైవర్లకు ఉపాధి కల్పించేవారు. పరిస్థితులు మారడంతో ఇప్పుడు ఓనర్లే డ్రైవర్లుగా మారుతున్నారు. ఎందుకిలా..? నగరవాసుల్లో కొనుగోలు శక్తి పెరగడంతో ఖరీదైన విదేశీ కార్లు రోడ్ల మీదకు వచ్చాయి. చాలామంది పెళ్లిళ్లకు సొంత కార్లనే వాడుకుంటున్నారు. ఒకవేళ అద్దెకు తీసుకునే వారు సైతం, కొత్త తరహా కార్ల వైపే మొగ్గు చూపుతున్నారు. మరోవైపు పర్మిషన్లు లేవంటూ ట్రాఫిక్ పోలీసుల వేధింపులు. దీంతో ‘ఇంపాలా’వాలాల బతుకులు భారంగా మారాయి. - సాక్షి, సిటీప్లస్ ఖ్వాయిష్తోనే నడుపుతున్నా... కారు ఓనర్ మాకు మూడొందలిస్తాడు. పెళ్లిళ్లకు వెళ్తే అక్కడా మరో మూడొందలు దొరుకుతుంది. కొందరు పెద్దమనసుతో ఎక్కువ మొత్తం కూడా ఇస్తుంటారు. మా నాన్న నుంచి వారసత్వంగా వస్తున్నాయనే... ఖ్వాయిష్తో నడపడమే తప్ప పెద్దగా వచ్చేదేమీ ఉండదు. గిరాకీ ఉన్న మూడు నాలుగు నెలలు మినహా మిగిలిన కాలంలో కొన్నిసార్లు పస్తులుండాల్సిన పరిస్థితి. - అబీబ్ ఫర్జూ రెహ్మాన్, డ్రైవర్