ఇంపాలా ఇప్పుడిలా
యాభయ్యేళ్ల కిందట పడవలాంటి ఇంపాలా కార్లు నగర వీధుల్లో గొప్ప దర్జాగా ఊరేగేవి. ఇంపాలా కారులో నవ వధూవరుల ఊరేగింపు అప్పటి తరానికి ఒక కనువిందైన దృశ్యం. అంబారీ ఏనుగు సవారీ సైతం దాని ముందు బలాదూరే! కాలంలో వచ్చిన మార్పులతో నగర వీధులు ఇరుకుగా మారాయి. ఇరుకు వీధుల్లో తిరిగేందుకు అనువైన ఇరుకిరుకు హ్యాచ్‌బ్యాక్ కార్ల జోరు పెరగడంతో ఇంపాలా కారు మూలనపడింది. ఒకప్పుడు ఘన వైభవాన్ని అనుభవించిన ‘ఇంపాలా’ ప్రస్తుత స్థితిపై ఓ కథనం...
ఇంపాలా సవారీ అప్పట్లో స్టేటస్ సింబల్. తొలినాళ్లలో ఇవి స్టేట్‌బ్యాంకు ఎదుట పార్క్ చేసి ఉండేవి. పెళ్లిళ్లు, ఇతర వేడుకల్లో ఊరేగింపుల కోసం అద్దెకిచ్చేందుకు కొందరు వీటిని మహారాష్ట్ర, కర్ణాటక నుంచి నగరానికి తీసుకువచ్చారు. పూలతో అలంకరించిన ఈ కార్లలో నూతన వధూవరులు ఊరేగుతుంటే జనం అబ్బురంగా తిలకించేవారు. నగరానికి చెందిన ప్రముఖ నేతలు ముఖేశ్‌గౌడ్, దానం నాగేందర్, మల్లు రవి వంటి వారు తమ పెళ్లిళ్ల సమయంలో ఈ కార్లలోనే ఊరేగారు. ఎల్బీ స్టేడియం నుంచి అబిడ్స్ వైపు వెళుతుంటే, బాంబే కేఫ్ పక్కన ఆనాటి ఇంపాలా కార్లు బారులు తీరి ఇప్పటికీ కనిపిస్తాయి. అయితే, అప్పటి కళ... ఇప్పుడు కనిపించదు. అప్పట్లో గిరాకీ బాగుండటంతో వీటి ఓనర్లు బాగానే బతికేవారు. డ్రైవర్లకు ఉపాధి కల్పించేవారు. పరిస్థితులు మారడంతో ఇప్పుడు ఓనర్లే డ్రైవర్లుగా మారుతున్నారు.
ఎందుకిలా..?
నగరవాసుల్లో కొనుగోలు శక్తి పెరగడంతో ఖరీదైన విదేశీ కార్లు రోడ్ల మీదకు వచ్చాయి. చాలామంది పెళ్లిళ్లకు సొంత కార్లనే వాడుకుంటున్నారు. ఒకవేళ అద్దెకు తీసుకునే వారు సైతం, కొత్త తరహా కార్ల వైపే మొగ్గు చూపుతున్నారు. మరోవైపు పర్మిషన్లు లేవంటూ ట్రాఫిక్ పోలీసుల వేధింపులు. దీంతో ‘ఇంపాలా’వాలాల బతుకులు భారంగా మారాయి.
- సాక్షి, సిటీప్లస్
ఖ్వాయిష్‌తోనే నడుపుతున్నా...
కారు ఓనర్ మాకు మూడొందలిస్తాడు. పెళ్లిళ్లకు వెళ్తే అక్కడా మరో మూడొందలు దొరుకుతుంది. కొందరు పెద్దమనసుతో ఎక్కువ మొత్తం కూడా ఇస్తుంటారు. మా నాన్న నుంచి వారసత్వంగా వస్తున్నాయనే... ఖ్వాయిష్‌తో నడపడమే తప్ప పెద్దగా వచ్చేదేమీ ఉండదు. గిరాకీ ఉన్న మూడు నాలుగు నెలలు మినహా మిగిలిన కాలంలో కొన్నిసార్లు పస్తులుండాల్సిన పరిస్థితి.
- అబీబ్ ఫర్జూ రెహ్మాన్, డ్రైవర్