నాగ్ కొత్త సినిమాకు అడ్డంకులు
స్టార్ హీరోల సినిమాలు వివాదాల్లో చిక్కుకోవడం ఇప్పుడు సర్వసాధారణం అయిపోయింది. టైటిల్ నుంచి కథ వరకు అన్నీ వివాదాలకు కారణం అవుతున్నాయి. అయితే భక్తిరస చిత్రాలు కూడా ఈ వివాదాలకు అతీతం కాదని తేలిపోయింది. నాగార్జున ప్రధానపాత్రలో తెరకెక్కుతున్న కొత్త సినిమా ఓం నమో వెంకటేశాయ విషయంలో కూడా వివాదానికి తెరలేచింది.
తిరుమల శ్రీ వేంకటేశ్వరుని పరమభక్తుడు హాథీరాం బాబా జీవితకథ ఆధారంగా రాఘవేంద్రరావు దర్శకత్వంలో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. అయితే సినిమా నిర్మాణంపై హాథీరాం మఠం నిర్వాహకులు అభ్యంతరం తెలుపుతున్నారు. తమను సంప్రదించకుండా, తమకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా సినిమా తెరకెక్కిస్తున్నారని, సినిమాలో అభ్యంతరకర సన్నివేశాలు ఉంటే సమస్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు.
అయితే ప్రస్తుతం టీటీడీ బోర్డు సభ్యునిగా గా ఉన్న రాఘవేంద్రరావుకు ఈ వివాదాన్ని ముగించటం పెద్ద సమస్యేమీ కాదు. త్వరలోనే హాథీరాం బాబా మఠం నిర్వాహకులను సంప్రదించి సినిమాను పట్టాలెక్కించాలని భావిస్తున్నారు చిత్రయూనిట్. నాగార్జున సన్నిహితుడు మహేష్ రెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమాకు ఎమ్ ఎమ్ కీరవాణి సంగీతం అందిస్తున్నారు.