శాంతి, సప్తగిరిలకు ప్రపంచ ఖ్యాతి
'బ్రో.. అర్జెంట్ గా దేవీ దగ్గరకి వచ్చెయ్..' స్నేహితుడితో ఓ హైదరాబాదీ ఫోన్ సంభాషణ.
ఒక్క భాగ్యనగరంలోనే కాదు ఏ ఊళ్లోనైనా సినిమా థియేటర్లను ప్రత్యేకంగా థియేటర్లుగా పిలవరు.
ఏదో స్నేహితుడి పేరు పలికినట్లు లలిత, సీతారామ, వాసవి, శ్రీనివాస.. అంటూ పిలుచుకుంటారంతే!
జీవితంలో ఎప్పుడో అతర్భాగమైపోయిన సినిమాలు చూడటానికి అందరం థియేటర్లకు వెళతాం. కొద్ది మందికి కొన్ని థియేటర్లతో ప్రత్యేక అనుబంధం ఉంటుంది. కొన్ని థియేటర్లు తమదైన ప్రత్యేకతతో పేరుపొందుతాయి. హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సప్తగిరి 70 ఎంఎం, నారాయణగూడా చౌరస్తాలోని శాంతి 70 ఎంఎం కూడా వాటి నిర్మాణ శైలిలోని ప్రత్యేకతతో ప్రపంచ ఖ్యాతి పొందాయి.
జర్మనీకి చెందిన జంట ఫొటోగ్రాఫర్లు హుబిట్జ్- జోచెలు భూగోళం అంతా సంచరించి ప్రఖ్యాత ప్రదేశాలు, అరుదైన కట్టడాల ఫొటోలు తీస్తారు. వారి ఫొటోగ్రాఫిక్ వర్క్స్, సైట్ స్పెసిఫిక్ ఇన్ స్టాలేషన్స్ కు ఘనమైన ఆదరణ ఉంది. దక్షిణ భారత దేశంలో సినిమా హాళ్ల నిర్మాణాలపై హుబిట్జ్- జోచె ఫొటోగ్రాఫిక్ వర్క్ ను ప్రముఖ వార్తా సంస్థ సీఎన్ఎన్ తన వెబ్ సైట్ లో ప్రత్యేక కథనంగా ప్రచురించింది. దక్షిణ భారతదేశంలోని హైదరాబాద్, బెంగళూరు, చెన్నై నగరాల్లోని అరుదైన నిర్మాణశైలి ఉన్న ఈ సినిమాహాళ్ల ఫొటోలను 2011-2014 మధ్య కాలంలో తీసినవని, ఇవి సంప్రదాయానికి ఆధునికతను జోడించినట్లుగా కనిపిస్తాయని పొటోగ్రాఫర్ జోచె అంటున్నారు.