డబ్బుల కోసం డాక్టర్‌కు బెదిరింపులు..
సాక్షి, చైతన్యపురి: డబ్బులు ఇవ్వాలని ఓ డాక్టర్‌ను బెదిరిస్తున్న ముగ్గురు వ్యక్తులను సరూర్‌నగర్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. శుక్రవారం ఎల్బీనగర్ ఏసీపీ పృద్వీధర్ వివరాలు వెల్లడించారు. దిల్సుఖ్నగర్ శ్రీనగర్‌కాలనీకి చెందిన డాక్టర్ గంజి శ్రీనివాస్ కన్సల్టెంట్ ఆడియోలజిస్టుగా పనిచేస్తున్నాడు.
ఓ కంపెనీలో మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్‌గా పనిచేసే భీమా లక్ష్మణ్ ద్వారా అతను వినికిడి యంత్రాలను కొనుగోలు చేసేవాడు. తక్కువ ధరకు వాటిని కొనుగోలు చేసి పేషెంట్లకు ఎక్కువ ధరకు ఇస్తున్నట్లు గుర్తించిన లక్ష్మణ్ తనకు వాటా ఇవ్వాలని డిమాండ్ చేశాడు. ఇందుకు శ్రీనివాస్ అంగీకరించకపోవడంతో నల్గొండ జిల్లాకు చెందిన తన స్నేహితుడు మేకల రఘురాంరెడ్డికి చెప్పడంతో అతను డాక్టర్‌కు ఫోన్‌చేసి వ్యవహారం త్వరగా సెటిల్ చేసుకోవాలని సూచించాడు.
అనంతరం వరంగల్‌కు చెందిన పొగాకుల నాగరాజు విలేకరినని పరిచయం చేసుకుని డాక్టర్‌కు ఫోన్‌చేసి త్వరగా డబ్బులు ఇవ్వకపోతే వార్త రాస్తానని బెదిరించాడు. డాక్టర్ ఫిర్యాదు మేరకు ఎస్ఐ మన్మదకుమార్ కేసు నమోదు చేశారు. శుక్రవారం హయత్‌నగర్‌లో నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.