హాయ్ ల్యాండ్ అంటే నాకు తెలియదు
విభజన తర్వాత రాజధానిలో భూములు కొనలేదు : సుజనా
సాక్షి, న్యూఢిల్లీ: ‘హాయ్‌ల్యాండ్ అంటే నాకు తెలియదు. అగ్రిగోల్డ్ గొడవ గురించి మీడియా ద్వారానే తెలిసింది. రాష్ట్ర విభజన తర్వాత కొత్త రాజధాని ప్రాంతంలో నేను భూములు కొనుగోలు చేయలేదు’ అని కేంద్ర మంత్రి సుజనాచౌదరి తెలిపారు. శుక్రవారం ఆయన ఓ టీవీ చానెల్‌తో మాట్లాడారు. ‘ప్రతి విమర్శకూ స్పందిస్తే రాష్ట్రాభివృద్ధి కోసం పనిచేయలేం. ఈ వ్యవహారంపై విచారణ అవసరమా లేదా అనేది సీఎం చూసుకుంటారు. అయినా ‘ఎవరైనా కబ్జా చేశారా? ఏంటి? విచారణ అడగడం హాస్యాస్పదంగా ఉంది. నాకు తెలిసి విభజన తర్వాత నేను ఆ ప్రాంతంలో పొలాలు కొనలేదు. నా కుటుంబంలో కూడా ప్రభుత్వం నుంచి ఒక్క అంగుళం తీసుకోలేదు. ప్రైవేటులో కూడా అన్యాయంగా కొనలేదు. ఆ ప్రాంతానికి చెందిన వ్యక్తిగా ఉంటే కొంత భూమి ఉండి ఉండొచ్చు. అంతేగానీ వైఎస్సార్సీపీ చెప్పినట్లుగా మాత్రం 700 ఎకరాలు ఎక్కడా లేవు’ అని సుజనా స్పష్టం చేశారు. దీనిపై లీగల్ చర్యలు అవసరం లేదని, దానికి సంబంధించిన విభాగం ఈ విషయాన్ని చూసుకుంటుందని సుజనా చెప్పారు.