ఆర్ఐఎల్ హజీరా ప్లాంట్‌పై ‘ఎక్సైజ్’ఎగవేత ఆరోపణ
న్యూఢిల్లీ: గుజరాత్‌లోని రిలయన్స్ ఇండస్ట్రీస్ (ఆర్ఐఎల్) హజీరా తయారీ యూనిట్‌పై దాదాపు రూ.25 కోట్ల మేర ఎక్సైజ్ సుంకం ఎగవేత ఆరోపణలు వచ్చాయి. సెంట్రల్ రెవెన్యూ అధికారులు ఈ అంశంపై దృష్టి సారించారు. సెంట్రల్ ఎక్సైజ్ ఇంటెలిజెన్స్ డెరైక్టరేట్ జనరల్ (డీజీసీఈఐ) ఈ కేసు విచారణను ప్రారంభించిందనీ, ఆర్ఐఎల్ నుంచి కొన్ని వివరణలు కోరిందని అధికార వర్గాలు తెలిపాయి. సంస్థలో ఉత్పత్తిచేసి, పెయింట్ కర్మాగారాలకు విక్రయించే కెమికల్ జీలీన్ మిశ్రమ (నాఫ్తా విచ్ఛిత్తి ద్వారా పొందిన రసాయనం) వర్గీకరణ విషయంలో అవకతవకలు జరిగినట్లు ప్రధాన ఆరోపణ. ఈ కెమికల్‌ను మినరల్ ఆయిల్గా వర్గీకరించి 14 శాతం సుంకం చెల్లించాల్సి ఉండగా, ఆర్గానిక్ కెమికల్గా చూపించి 12.5 శాతం సుంకం చెల్లించిందన్నది ఆరోపణ.
తోసిపుచ్చిన ఆర్ఐఎల్
కాగా ఆర్ఐఎల్ ప్రతినిధి ఒకరు ఈ అంశంపై మాట్లాడుతూ, పూర్తి నియమ నిబంధనల ప్రకారమే తాము నడుచుకున్నట్లు తెలిపారు. వివిధ ప్రభుత్వ ఏజెన్సీలు తరచూ తమ కార్యకలాపాల రికార్డులను ఆడిట్ చేస్తున్నారనీ వివరించారు. కెమికల్ వర్గీకరణ విధం సరైనదేనని అన్నారు. తమ వాదన విషయంలో ఆర్ఐఎల్ ముంబైకి చెందిన ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ అభిప్రాయాన్ని కోరినట్లు సమాచారం. డీజీసీఈఐకు ఈ నివేదికను ఆర్ఐఎల్ సమర్పించే అవకాశం ఉందని తెలుస్తోంది.