అల్లానే మా అమ్మాయిని కాపాడాడు..
సాక్షి, విజయవాడ : ‘మా అమ్మాయిని అల్లానే కాపాడాడు. పోకిరీల వికృత చేష్టలపై ఫిర్యాదు చేసినా రైల్వే పోలీసులు స్పందించకపోవడం వల్లే ప్రమాదం జరిగిందని’ షేక్ నజ్బుల్లా తల్లిదండ్రులు షేక్ జాకీర్, నజియా బేగం పేర్కొన్నారు. పోకిరీల వికృత చేష్టలతో రైలు నుంచి దూకి గాయపడ్డ నజ్బుల్లా చికిత్స అనంతరం నిన్న (శుక్రవారం) రాత్రి విజయవాడలోని పెజ్జోనిపేటలోని తన ఇంటికి చేరింది. ఈ సందర్భంగా ఆమె తల్లిదండ్రులు మాట్లాడుతూ.. వరుస సెలవులు రావడంతో బక్రీద్ పండుగను తమతో కలిసి జరుపుకుందామని స్నేహితులతో కలిసి నజ్బుల్లా చెన్నై నుంచి బయలుదేరిందన్నారు. రైలులో పోకిరీలు వేధిస్తున్నారని పలుమార్లు ఫిర్యాదు చేసినా రైల్వే పోలీసులు పట్టించుకోలేదన్నారు.
కాగా సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా పని చేస్తున్న నజ్బుల్లా తన స్నేహితురాళ్లతో కలిసి మిలీనియం ఎక్స్‌ప్రెస్ రైలులో చెన్నై నుంచి విజయవాడ వస్తుండగా కొందరు పోకిరీలు అఘాయిత్యం చేయబోయారు. సూటిపోటి మాటలు.. వెకిలి చేష్టలతో అసభ్యంగా ప్రవర్తించే సరికి తట్టులేక ఆమె ప్రకాశం జిల్లా సింగరాయకొండ వద్ద నడుస్తున్న రైలులో నుంచి దూకేసిన విషయం తెలిసిందే. ఈ ఘటనకు సంబంధించి ఉత్తరప్రదేశ్‌కు చెందిన ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు.