హజ్రత్ నిజాముద్దీన్ మెట్రో స్టేషన్ భారీ ఇంటర్ చేంజ్ పాయింట్
సాక్షి, న్యూఢిల్లీ : ముకుంద్‌పుర్- శివ్ విహార్కారిడార్లో భాగంగా భూగర్భంలో నిర్మించనున్న హజ్రత్ నిజాముద్దీన్ మెట్రో స్టేషన్ ఇతర ప్రాంతాలనుంచి వచ్చేవారితోపాటు స్థానికులకు భారీ ఇంటర్చేంజ్ పాయింట్‌గా మారనుంది. హజ్రత్ నిజాముద్దీన్ రైల్వేష్టేషన్, సరాయ్ కాలేఖాన్ ఐఎన్బీటీలను కలుపుతూ హజ్రత్ నిజాముద్దీన్ మెట్రో స్టేషన్‌ను నిర్మిస్తున్నారు. ఈ స్టేషన్లో రైల్వేస్టేషన్‌తోపాటు ఐఎస్బీటీ కోసం ప్రత్యేక ఆగమన, నిష్ర్కమణ ద్వారాలు ఉంటాయి. అంతేకాకుండా రైల్వే స్టేషన్-ఐఎస్బీటీలను కలుపుతూ 100 మీ పొడవు సబ్వేను కూడా నిర్మిస్తారు. హజ్రత్ నిజాముద్దీన్ రైల్వేస్టేషన్‌ను, సరాయ్ కాలేయ్ ఐఎస్బీటీని కలిపే ఈ మెట్రో స్టేషన్ స్థానిక ప్రయాణీకులతో పాటు, బయటి నుంచి నగరానికి వచ్చే ప్రయాణికులకు ఇంటర్చేంజ్ పాయింట్ కానుంది.
ఐఎస్బీటీ కోసం మెట్రో స్టేషన్ ప్రవేశ, నిష్ర్కమణ పాయింట్లు ఐఎస్బీటీలోనే ఉంటాయి. రైల్వే స్టేషన్‌కు ప్రవేశ, నిష్ర్కమణ పాయింట్లు స్టేషన్ కాంప్లెక్స్‌కు 50 మీటర్ల దూరంలో ఉంటాయి. మెట్రో స్టేషన్‌కు మూడో ప్రవేశ నిష్ర్కమణ పాయింట్ స్మృతి వన్ వైపు ఉంటుంది. ఇవికాకుండా రైల్వేస్టేషన్‌ను ఐఎస్బీటీతో కలిపే 100 మీటర్ల సబ్‌వేతోపాటు అనేక ప్రవేశ నిష్ర్కమణ పాయింట్లను ఏర్పాటు చేస్తారు. 2016 నాటికి ఈ స్టేషన్‌ను 53,370 మంది, 2021 నాటికి 72 వేల మందికి పైగా ఉపయోగించుకోగలుగుతారని అం చనా.
భూగర్భంలో 18 మీటర్ల లోతున నిర్మించే ఈ మెట్రో స్టేషన్ ఇంజనీరింగ్అత్యద్భుతం కానుందని వారంటున్నారు.యమునా నదికి సమీపాన ఉన్నందువల్ల చుట్టూరా ఎల్లప్పుడూ నీరు నిలిచిఉండే ఈ మెట్రో స్టేషన్ నిర్మాణం కోసం కొత్త టెక్నాలజీని ఉపయోగిస్తున్నారు. మెట్రో స్టేషన్ నిర్మాణం కోసం ప్రత్యేకమైన డ్రైనేజ్ వ్యవస్థను నిర్మిస్తున్నారు. ఈ మెట్రో స్టేషన్‌ను ఆశ్రమ్, మయూర్ విహార్ మెట్రో స్టేషన్ల మధ్య నిర్మిస్తారు. లజ్‌పత్‌నగర్ నుంచి నిజాముద్దీన్ వరకు 3.36 కి.మీ పొడవైన టన్నెల్ నిర్మాణ పనులు మొదలయ్యాయి.