ఆటలను ఆపేసి...
సాక్షి, హైదరాబాద్: ఎల్బీ స్టేడియంలో ఏపీఎన్జీవోల సమైక్యాంధ్ర సభకు అనుమతి ఇచ్చేందుకు ప్రభుత్వం అన్ని నిబంధనలను పక్కన పెట్టింది. వాస్తవానికి షెడ్యూల్ ప్రకారం 7వ తేదీన హెచ్సీఏ క్రికెట్ లీగ్ మ్యాచ్లు జరగాల్సి ఉంది. సభ కోసం ఆ మ్యాచ్లను రద్దు చేశారు. తర్వాతి రోజు అంటే ఆదివారంనుంచి సివిల్ సర్వీసెస్ క్రీడల కోసం ఇప్పటికే అధికారులు స్టేడియాన్ని కేటాయించారు. అయితే సభ జరిగాక టోర్నీ ఏర్పాట్ల కొరకు తగిన సమయం లేకపోవడంతో సివిల్ సర్వీసెస్ క్రీడలను వాయిదా వేయాల్సి వచ్చింది.
జీఓ నం. 20 ప్రకారం క్రీడా ప్రాంగణాలను అద్దెకు ఇవ్వడంలో ప్రథమ ప్రాధాన్యత క్రీడలకే ఇవ్వాలి. అది జాతీయ, అంతర్జాతీయ స్థాయి టోర్నమెంట్ కాకపోయినా...ఉద్యోగులు, కార్పొరేట్ సంస్థలు తమ స్థాయిలో ఆటలు నిర్వహించుకున్నా సరే వాటికి అవకాశం ఇచ్చిన తర్వాత క్రీడేతర కార్యక్రమాలకు మైదానాన్ని వినియోగించాలనే నిబంధన ఉంది. దాంతో పాటు అప్పటికే నిర్ణయించిన క్రీడా కార్యక్రమాలకు ఆటంకం కలగకుండా క్రీడేతర కార్యక్రమాలకు స్టేడియాన్ని ఇవ్వాల్సి ఉంటుంది. అయితే ఏపీఎన్జీవోల సభ విషయంలో మాత్రం సడలింపు ఇచ్చారు.