'ఉద్యమం ఆగదు.. 25న ఛలో హెచ్సీయూ'
హైదరాబాద్: దళిత పీహెచ్డీ విద్యార్థి వేముల రోహిత్ ఆత్మహత్య నేపథ్యంలో తాము చేస్తున్న ఆమరణ నిరాహార దీక్షను పోలీసులు భగ్నం చేసినంతమాత్రాన తమ ఉద్యమం ఆగబోదని హెచ్సీయూ విద్యార్థి జేఏసీ స్పష్టం చేసింది. మరో ఏడుగురు విద్యార్థులతో మరోసారి ఆమరణ దీక్షకు సిద్ధమవుతున్నట్టు తెలిపింది.
హెచ్సీయూ ప్రాంగణంలో విద్యార్థుల దీక్షను భగ్నం చేసి.. వారిని ఆస్పత్రికి తరలించిన నేపథ్యంలో విద్యార్థి జేఏసీ నేతలు శనివారం రాత్రి విలేకరులతో మాట్లాడింది. రోహిత్ కుటుంబానికి న్యాయం జరిగే వరకూ, తమ డిమాండ్లన్నీ నెరవేరేవరకూ తమ పోరాటం కొనసాగుతుందని హెచ్సీయూ జేఏసీ నేతలు తెలిపారు. ఈ నెల 25న 'ఛలో హెచ్సీయూ' కార్యక్రమానికి పిలుపునిచ్చారు. ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొనేందుకు దేశంలోని అన్ని వర్సిటీల నుంచి విద్యార్థుల తరలిరావాలని కోరారు.