ఇదేనా.. ‘ఫ్రెండ్లీ పోలీసు’
ఆర్మూర్ : తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు పోలీసులను చూసి భయపడకుండా పోలీస్ స్టేషన్‌కు ఫిర్యాదు చేయడానికి ధైర్యంగా వెళ్లే స్నేహపూరిత వాతావరణం కల్పిస్తామంటూ సీఎం కేసీఆర్ ప్రకటిస్తుంటే క్షేత్ర స్థాయిలో మాత్రం పోలీసుల తీరు అందుకు విరుద్ధంగా ఉంది. దీనికి ఆర్మూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఐదు రూపాయలు తక్కువ చేయలేదంటూ వ్యాపారితో శనివారం ఓ హెడ్ కానిస్టేబుల్ ప్రవర్తించిన తీరే నిదర్శనం. ప్రత్యక్ష సాక్షులు, బాధితులు తెలిపిన వివరాల ప్రకారం..
ఆర్మూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో హెడ్ కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్న నర్సయ్య స్థానిక బస్టాండ్ సమీపంలోని ఒక దుకాణంలో రూ. 15 విలువైన విజిల్ కొనుగోలు చేశాడు. హెడ్ కానిస్టేబుల్ ఐదు రూపాయలు తక్కువ చేయమని అడగగా, తమకు వచ్చిన ధరకే ఇచ్చాం సార్ అంటూ దుకాణం యజమాని రూ. 15 తీసుకున్నాడు. ఇదే రోజు సాయంత్రం బస్టాండ్ సమీపంలో సదరు దుకాణం ఎదురుగానే ఆర్మూర్ ఎస్సై బోసు కిరణ్ ఆధ్వర్యంలో ద్విచక్రవాహనాల తనిఖీ నిర్వహించారు.
హెడ్ కానిస్టేబుల్ విజిల్ కొనుగోలు చేసిన దుకాణానికి చెందిన కార్మికుడు మోటార్ బైక్‌పై వెళ్లడాన్ని గమనించి పట్టుకున్నాడు. మోటార్ సైకిల్లో భద్రంగా ఉంచిన రిజిస్ట్రేషన్ కార్డు, ఇన్సూరెన్స్ పేపర్లను చూపించి, ఎదురుగానే దుకాణంలో ఉన్న డ్రైవింగ్ లెసైన్సును తీసుకువచ్చి హెడ్ కానిస్టేబుల్‌కు చూపించాడు. మీ దుకాణానికి పోలీసులు వస్తే డబ్బులు తక్కువగా తీసుకుంటలేరు ఇప్పుడు ఫైన్ కట్టాల్సిందేనంటూ హెడ్ కానిస్టేబుల్ నర్సయ్య ఆగ్రహం వ్యక్తం చేశాడు. దీంతో ఆ కార్మికుడు తమ యజమానిని తీసుకొని పోలీసుల వద్దకు వచ్చాడు.
మోటార్ సైకిల్‌కు అవసరం ఉన్న పేపర్లు అన్ని ఉన్నాయంటూ చూపించే ప్రయత్నం చేసినా మోటార్ సైకిల్‌ను పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లారు.ఈ విషయం అక్కడే ఉన్న సీఐ, ఎస్సైలకు దృష్టికి తీసుకువెళ్లినా, వారి స్టేషన్‌కు వెళ్లి తెచ్చుకోవాలని సెలవిచ్చారు. దీంతో చేసేది లేక బాధితులు పోలీస్ స్టేషన్‌కు వచ్చి ఎస్‌హెచ్‌వో రవి కుమార్‌కు మోటార్ సైకిల్ పేపర్లు చూపించి హెడ్ కానిస్టేబుల్ వ్యవహరించిన తీరును తెలిపారు.
దీంతో ఆయన స్పందించి దుకాణం యజమానికి మోటార్ సైకిల్ ఇప్పించి హెడ్ కానిస్టేబుల్‌ను పిలిచి మాట్లాడతానని చెప్పుకొచ్చారు. జరిగిన సంఘటన చిన్నదే అయినా ఐదు రూ. తక్కువ చేయలేదన్న కారణంగా హెడ్ కానిస్టేబుల్ ప్రవర్తించిన తీరు పోలీసులపై మరింత చెడు అభిప్రాయాన్ని కలిగించేదిగా ఉందని సంఘటన స్థలంలో ఉన్న వారు అభిప్రాయపడ్డారు.